కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్సైంది. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాల తొలిరోజు ఈ నెల 31న లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్‌పై కేంద్రం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈసారి పార్లమెంట్ సెషన్ మధ్యలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు వెలువడనుండటంతో ఈ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్‌లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి పెద్దపీఠ వేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.
అలాగే.. బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..