నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడ్ని థానేలో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు. ఇదిలా ఉండగా నిందితుడి గురించి పోలీసులు చేసిన వాదనలు షాక్‌కు గురిచేశాయి. సైఫ్ అలీఖాన్‌పై దాడి అంతర్జాతీయ కుట్రలో భాగమేనని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. మరోవైపు విచారణ సందర్భంగా కూడా న్యాయమూర్తి కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. దాడి ఘటనపై అంతర్జాతీయంగా కుట్రను కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. కాగా నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా తెలిసింది.
కోర్టులో బలమైన వాదనలు
కోర్టులో ఇరువైపులా బలమైన వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా, నిందితుడి గురించి సమాచారం ఇస్తూ, నిందితుడు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, నటుడిపై దాడి చేసి, మరో ఇద్దరిని గాయపరిచాడు. నిందితుడి వద్ద ఒక కత్తి దొరికింది. అతను ఆ రోజు ధరించిన దుస్తులు కూడా దాచాడు. అతను బంగ్లాదేశ్ జాతీయుడు. దేశంలోకి ఎలా ప్రవేశించాడో గుర్తించడం ముఖ్యం. మాకు 14 రోజుల కస్టడీ కావాలి” అని పోలీసులు తరుపున లాయర్లు వాదించారు.
ఈ ఘటన నటుడి ఇంట్లో జరిగింది కాబట్టి.. ఈ రోజు మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేసింది. ఒక సామాన్యుడి ఇంట్లోనే ఈ ఘటన జరిగి ఉంటే ఇంతటి ప్రాధాన్యత వచ్చేది కాదు. పోలీసులు కూడా ఇలా స్పందించేవాళ్లు కాదు. నిందితుడు బంగ్లాదేశీయుడు కాదు, ముంబైలో నివసిస్తున్న భారతీయ పౌరుడని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. రిమాండ్ దరఖాస్తులో పోలీసులు కస్టడీకి గల కారణాలను స్పష్టంగా పేర్కొనలేదు. నిందితుడు ముందస్తు నేర చరిత్ర లేని వ్యక్తి. అతడిని బలిపశువుని చేయాలని చూస్తున్నారు, ”అని డిఫెన్స్ లాయర్ కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి ఐదు రోజుల కస్టడీ విధించింది.
“నిందితుడు బంగ్లాదేశ్ పౌరుడు. అంతర్జాతీయ కుట్ర అనుమానం అసాధ్యం అని చెప్పలేము. కాబట్టి, విచారణ అధికారికి తగిన సమయం ఇవ్వాలి. అందువల్ల 5 రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేస్తున్నాం’’ అని కోర్టు పేర్కొంది.
మరోవైపు సైఫ్ కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి