మహాశివరాత్రి అంటే శివ భక్తులంతా భక్తి పారావస్యంతో మునిగితేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే ఇక భక్తులకు పండగే. ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంకి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే శక్తి పీఠాలలో జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది. అంతేకాదు ఒకే చోట శక్తి పీఠము జ్యోతిర్లింగము కొలువైన ప్రదేశం కావడంతో శ్రీశైలానికి ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం తరలివస్తారు. అటువంటి మహా శివరాత్రి ఏర్పాట్లపై ఏకంగా మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్షించింది. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాదు మొట్టమొదటిసారిగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వచ్చే భక్తులకు మంత్రుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది.
అదేంటంటే… మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు రోజులపాటు అంటే ఈనెల 24 నుంచి శివరాత్రి ముగిసే వరకు అంటే 27 వరకు భక్తులకు ఉచితంగానే లడ్డు ప్రసాదం అందిస్తారట. అంతే కాదండోయ్.. స్వామి అమ్మవారి దర్శనార్థం వచ్చి క్యూలైన్లలో ఉండే భక్తులకు 200 ఎం.ఎల్ మినరల్ వాటర్, పాలు, బిస్కెట్లు కూడా అందజేస్తారట. మరో సౌలభ్యాన్ని కూడా కల్పించారు.
క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి వసతి గృహాలకు, సత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఉచితంగా మినీ వాహనాలను కూడా ఏర్పాటు చేసినట్లు, మంత్రుల బృందం ప్రకటించింది. అలానే మహాశివరాత్రి రోజు అంటే 25, 26 తేదీలలో దేవస్థానం టోల్ గేట్ వద్ద ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతిస్తున్నట్లు మంత్రుల బృందం ప్రకటించింది. అబ్బబ్బ.. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇన్ని సౌలభ్యాలు కల్పించడం ఇదే మొదటిసారి అని అంతటా చర్చ జరుగుతుంది. ఈ సౌకర్యాలు అన్ని భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి