తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.
గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను ఈవో అతనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, ఉదయం నుండి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
రథ సప్తమికి రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది కలగకుండా షెడ్లు ఏర్పాటు చేసిన టీటీడీ, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేయనుంది. రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగించనుంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన టీటీడీ యంత్రాంగం సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు భద్రత కల్పిస్తోంది.
రథసప్తమికి ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు. రథసప్తమికి వచ్చే భక్తులకు సేవలు అందించే సిబ్బందికి ఈఓ దిశా నిర్దేశం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందితో ఇప్పటికే సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో గ్యాలరీ లలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేశారు. సమిష్టిగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని కోరారు.
ఇక ప్రతి గ్యాలరీకి ఇంఛార్జితో పాటు, అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకుని, ప్రతి ఉద్యోగి సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని ఈవో సిబ్బందికి సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలన్నారు. చేయాల్సినవి, చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా భక్తులకు సేవలు అందించాలన్నారు.
రథసప్తమి నేపథ్యంలో వాహనాల సేవల్లో పాల్గొనే భక్తులకు నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు టీటీడీ ఏర్పాటు చేసింది. ఇక 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో గ్యాలరీలలో అత్యవసర పరిస్థితి తలెత్తకుండా అగ్నిమాపక, మెడికల్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు.
రోజంతా మాడవీధుల్లోని గ్యాలరీలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, గ్యాలరీలలోకి చేరిన భక్తుల నుంచి టీటీడీ ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ప్రతి గ్యాలరీలో చలికాలంలో మంచుకు భక్తులు ఇబ్బంది జర్మన్ షెడ్లను టీటీడీ ఏర్పాటు చేయగా సౌకర్యాల పట్ల భక్తుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి గ్యాలరీలో అందుబాటులో ఉన్న సౌకర్యాల పై ఆరా తీసిన అదనపు ఈవో, జేఈవోలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. రథసప్తమి రోజు గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని నిర్ణయించింది. అన్నప్రసాదాలు, తాగునీరు పాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. వాహన సేవల సమయంలో మరింత బాధ్యతాయుతంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించింది.
రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ అలంకరణ చేపట్టింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించింది. వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి వాహనసేవలను దర్శించేందుకు రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా టీటీడీ ఏర్పాట్లు చేయగా ఏర్పాట్ల పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులు ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వితరణగా అందించనుంది. గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ప్రాంతాల్లో ఉండే భక్తులు వాహన సేవలను తిలకించేందుకు భారీ ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలు వినియోగిస్తోంది.మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు కేటాయించింది టీటీడీ.
రథసప్తమి రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 3 రోజులు పాటు ఎస్‌ఎస్‌డీ టోకన్లు జారీని టీటీడీ నిలిపి వేసింది. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి సర్వదర్శనం చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. రథసప్తమి సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.