ఆదివాసీ సంగీత వాయిద్య ప్రపంచం.. సముద్రమంత లోతైనదీ.. ఆకాశమంత విశాలమైనదీ… పుట్టుక నుండి చావు వరకు.. ఎందెందు వెతికినా అందదు కలదు అన్నట్టుగానే కనిపిస్తూ.. వీనుల విందు చేసేలా మైమరపింప చేస్తూ సాగుతోంది. ఆఫ్రికా అడవుల్లో మారు మోగే డోల్ డప్పుల శబ్దం అనంత దూరంలో ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్ గోండు గిరిజన గూడెంలో ప్రతిధ్వనిస్తోంది. నేటీవ్ అమెరికన్ల ఫ్లూట్ గమకాలు ప్రాణహిత పరివాహక ప్రాంతానికి చెందిన నాయకపోడ్‌ల పిల్లనగ్రోవిలో జాలువారతున్నాయి. ఈశాన్య భారతంలోని నాగాల డోలు మోతలు ఇంద్రవెళ్లి కెస్లాపూర్ నాగోబా జాతరలో డమరుకమై మారుమోగుతున్నాయి. ఒకటా రెండా వందకు పైగా వాయిద్యాలు.. సర్వజనం మెచ్చిన ప్రతిధ్వనులు.. ఒక్కసారి ఆ సంగీతాన్ని వింటే చాలు… ఆ కచేరీలను కనులారా చూస్తే చాలు… శతబ్దాల నాటి సంస్కృతి సంప్రదాయాలను ప్రాణంలా కాపాడుతూ సాగుతున్న ఆ ఆదివాసీ ఆట పాటలను ఆస్వాదిస్తే వావ్ ఉస్తాద్ అని తీరాల్సిందే. మరెందుకు ఆలస్యం ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్లోద్దాం రండి. అడవంతా ప్రతిధ్వనించే ఆ గిరిజన సంగీతాన్ని మనసారా ఆస్వాదిద్దాం పదండి.
అడవుల జిల్లా ఆదిలాబాద్.. ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు తరతరాల కట్టుబాట్లకు పెట్టింది పేరు. ఇక్కడ పుట్టుక నుండి చావు వరకు… విందు వినోదాలు.. పెళ్లిల్లు.. పేరంటాలు... పండుగలు, జాతరలు.. ఒక్కటేమిటి.. అడవంతా అల్లుకున్న గిరిజన గూడాల్లో వినోదమైన విషాదమైన తుడుం మోత మోగాల్సిందే.. డప్పుల దరువు అడవంతా వ్యాపించాల్సిందే. వనదైవం మెచ్చేలా గిరిజనం తాండవమాడాల్సిందే. శతాబ్దాల వారసత్వాన్ని కాపాడుకుంటూ కొత్త తరానికి గమక చమకాలతో ఊపిరి పోయాల్సిందే. అలా సాగుతున్న శబ్దమే ఇప్పుడు మీరు వింటున్న తుడుం మోతల స్వరం.
గోదావరి , ప్రాణహిత , పెనుగంగా నదుల నడుమ ఆదిలాబాద్ అడవుల్లో జీవనం సాగిస్తున్న తొమ్మిది తెగల ఆదివాసీల సొంతం ఈ అద్బుత కళ. ఆదివాసీల్లోని తొమ్మిది తెగలైన గోండు, తోటి, పర్దాన్, కోయా, కోలాం, అంధ్, చెంచు, నాయకపోడు తెగల తీరక్క వాయిద్యాల ఈ వినసొంపైన సంగీతం విని ప్రాణకోటి మైమరిచి పోవాల్సిందే. అందులోను పుష్యమాసం వచ్చిదంటే ఆ ధ్వని మరింత రెట్టింపై ఆకాశమంత విస్తరించిందా అన్నట్టు వినిపిస్తుంటే .. జంగుబాయి , నాగోబా , ఖాందేవ్ జాతరల్లో ప్రత్యేకంగా మోగుతున్న వాద్యాల శబ్దం విని తీరాల్సిందే. అందులో ప్రధానమైనవే.. పెప్రె, థోలు, కాళికోం, గుమ్మెళ, పర్ర, వెట్టె, పెప్రె, కాళికోం, తుడుం, డప్పు, పేటి. ఒక్కో తెగకు ఒక్కో వాయిద్యం అన్నట్టుగా.. తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పరిడవిల్లుతోంది ఆదిమ గిరిజన సంగీతం.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని గిరిజన తెగలన్నింటిలో డప్పు వాద్యం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు ఉపయోగించే డప్పులు ఆకారంలో చిన్నగా, పెద్దగా కనిపిస్తుంటా. పెద్దగా ఉండే డప్పులు ఆకర్షనీయంగా ఉండటమే గాక ఉత్సాహాన్ని కలిగించే శ్రావ్యమైన ధ్వనిని సృష్టిస్తాయి. ఈ డప్పులను తయారు చేసుకోవడానికి కావలసిన పట్టీ కోసం కుక్కెలికి కర్ర లేదా ఆరెకర్ర లేదా టేకు కర్రను ఉపయోగించడం ఆచారంగా వస్తుందని చెప్తారు గిరిజనం. ఈ పట్టీకి చర్మాన్ని ముడుచుకోవడానికి దారుగు చెక్క, మొర్రి పండు బంకను బాగా ఉడికించి జిగురు తయారు చేసుకుంటారు. ఆ జిగురును పట్టీ అంచుకు రాస్తూ, చర్మాన్ని వంచుతారు. అలా తయారు చేసుకున్న పరికరంతో వచ్చే సంగీతం అద్బుతంగా ఉంటుందని చెప్తారు.
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ తొమ్మిది తెగల్లో కోలామ్ లది అత్యంత ప్రాచీన తెగ. వీరు ఆడే ఆట పాడే పాట విభిన్నంగా నిలుస్తుంది. ఈ తెగ గిరిజనం డోలు, డప్పు, మృదంగం, గుమ్మేల, పిల్లనగ్రోవి వాయిద్యాలను వాయిస్తూ వాటికి అనుగుణంగా నృత్యం చేస్తారు. పెళ్ళిళ్ళలో అయితే వేత, డెంసా అనే నృత్యాలను పోటీలుపడి మరీ చేస్తారు. ఆ నృత్యాలకు తగ్గట్టుగా లయ బద్దంగా సాగే పాట అందరిని కట్టి పడేస్తుంటాయి.
ఆదివాసీల్లోని మరో తెగ నాయకపోడ్ తెగ గిరిజనం ఆడిపాడే తప్పెటగూళ్ల ఆటలు.. రుంజ, సన్నాయి, పిల్లనగ్రోవులు వాయిద్యాలు ఆకట్టుకుంటాయి. ఆదిలాబాద్ ప్రాంతానికే చెందిన తోటి, పర్ధాన్ తెగ ఉపయోగించే కీకిరి వాద్యాన్ని తంత్రీలు , చర్మంతో కలిసి తయారు చేసుకుంటారు. ఈ కీకిరి వాద్యంతో కళాకారులు గోండు సంస్కృతికి చెందిన అన్నోరాని, సదర్బీడి వంటి కథలను కథాగానం చేస్తారు. ఈ వాద్యం మణిపూర్ లోని పేనా, ఒరిస్సాలోని కెన్రా బాణం, రాజస్థాన్‍లో రావణ హట్టా, కేరళలోని వీణాకుంజ్ వంటి వాద్యాల పోలికలతో కనిపిస్తూ ఉంటుంది. వీటిని పర్ధాన్, తోటి గిరిజనులు మహంకాళి శక్తి నాలుకకు ప్రతిరూపంగా, హీరాబాయికి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇక వాద్యాన్ని వాయించడానికి ఉపయోగపడే కుజ్జాను జల్లిదేవరకు ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ కుజ్జాను బర్రె కొమ్ముతో విల్లు మాదిరిగా తయారు చేసుకుని దానికి గుర్రపు వెంట్రుకలను మందంగా విల్లుకు దారం కట్టినట్లుగా కడతారు. ఇది వారి అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అంధ్ తెగకు చెందిన గిరిజనం..
ఏక్తారా, డోలక్, డప్పుడి, తార్, మంజీరా, డోల్కి జాన్జర్, డోలు వాద్యాలను వాయిస్తుండగా.. తోటి గిరిజనులు.. కికిరి ,కుజ్జా డక్కి, డోలు, కాలికోమ్, సన్నాయి, బొంగా టిప్లింగ్ /చిటికెలు, తమ్మెడ బాజా, తోటి బుర్ర, 12 మెట్ల కిన్నెర, తుడుం మద్దెల, తాళాలు, గజ్జెలు, హార్మోనియం… పర్ధాన్ గిరిజనులు: సుర్నేయి, డోలు, బొంగా, కీకిరి డప్పుడి, వెట్టే పర్ర, కాలీకోమ్, తుడుం, డప్పు.. నాయకపోడు గిరిజనం: తప్పెట, పిల్లనగోయి, మూగడోలు, అందెలు, డప్పు వాయిస్తారు.
ఆదివాసీ గిరిజనం ఉపయోగించే కొన్ని వాద్యాలను కేవలం పండుగలు, దేవతల కొలుపుల సందర్భాల్లోనే బయటకు తీసి పవిత్రంగా వాయిస్తారు. ఇటువంటి వాద్యాల్లో గోండు గిరిజనులు ఉపయోగించే గుమేల, పర్ర, వెట్టె వంటి చర్మ వాద్యాలు వారి సంస్కృతిలో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇందులో గోండు వారిలోని నాలుగో సగా వారు ‘గుమేల’ వాద్యాన్ని దండారి దేవతకు ప్రతిరూపంగా కొలుస్తారు. అట్లాగే పర్ర వాద్యాన్ని ఐదు వేల్పుల వారు తమ దేవతకు ప్రతిరూపంగా పూజించడం విశేషం. వెట్టె వాద్యాన్ని ఏత్మాసూర్ దేవతకు పతిరూపంగా కొలువడం కనిపిస్తుంది. ఈ రకంగా వాయించే వాద్యాలను కేవలం దీపావళి పండుగ దండారి పండుగ సందర్భాల్లో మాత్రమే వాడుతారు ఆదివాసీలు.
దండారి పండుగ సందర్భంగా గుస్సాడీ సంబరాల్లో భాగంగా వాయించే గుమేల వాద్యాన్ని నిష్టతో కొలిచి వాయిస్తారు గిరిజనం. ఈ ఒక్క వాద్యాన్ని మిగతా రోజుల్లో బయటకు తీయడం గానీ, బయటి వ్యక్తులకు చూపించడం కానీ చేయరు. ఇందులో పర్ర వాద్యం మద్దెల మాదిరిగాను, వెట్టే వాద్యం కంజర ఆకారంలో వెడల్పుగా చర్మంతో ముడవబడి ఉంటుంది. పర్ర వాద్యానికి సహ వాద్యమైన వెట్టె వాద్యం మీద 18 రకాల దరువులు వాయిస్తారు. దీనికి అనుగుణంగా పర్రను వాయించడం జరుగుతుంది.
వెట్టె, పర్ర వాద్యాలను జోడువాద్యాలని పిలుస్తారు ఆదివాసీలు. గుస్సాడీలో ఈ రెండు వాద్యాల సంగీతానికి టప్పాల్, కొండల్ ధరించిన వారికి దేవుడు పూనకం వస్తుంటుంది. వీటి వాయింపుతో పాటుగా గుమేల, డప్పులు మోగిస్తారు. గిరిజన తెగలు ఉపయోగించే వాద్యాల్లోనే డేంచుక వాద్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది తంత్రీ వాద్యం. బైండ్ల కళాకారులు ఉపయోగించే జెముడిక మాదిరిగా కనిపించినప్పటికీ, తయారీలోనూ వాయించడంలోనూ భిన్నంగా ఉంటుంది. ఇది సుమారుగా మూరెడున్నర పొడవు వృత్తాకారం నుండి జానెడు వెడల్పు ఉంటుంది. దీని తయారీకి మొగిలి చెట్టు మొద్దు బోధగద్దనరం, మేక చర్మం, పాచి తీగ, గజ్జెలు మరియు ఇనుప రింగులు ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని వాయిస్తుంటే నాలుగైదు మైళ్లు శ్రావ్యమైన శబ్దం వినిపిస్తుంది.
నాయక పోడు గిరిజనుల ఇలవేల్పుగా కొలిచే లక్ష్మీదేవర ఆలయాల్లో అత్యంత పవిత్రంగా భావించే మూగడోలును భద్ర పరుస్తారు. ఇది సుమారుగా రెండు మీటర్ల పొడుగుతో ఇద్దరు కళాకారులు రెండు వైపులా వాయించేందుకు వీలుగా ఉంటుంది. కేవలం లక్ష్మీ దేవర కొలుపులోనే దీన్ని ఒక గుంజకు తగిలించి ఇద్దరు వ్యక్తులు చెరో వైపు ఉండి వాయిస్తారు. ఈ వాద్యాన్ని నాయక పోడు గిరిజనులు తమ దేవుడైన మూగలరాయునికి ప్రతిరూపంగా, పవిత్రంగా కొలుస్తారు. మరో వైపు ఆదివాసీ తొమ్మిదవ తెగ అంధ్ గిరిజనులు ఆదిలాబాద్ ప్రాంతంలో అంధ్ లకే మరాఠీ భాషలో కండోభ కథను చోండ్కా, మంజీరా, డప్పులు, డోలక్, తాళాలు వంటి వాద్యాలను ఉపయోగించి కథాగానం చేస్తారు. వీరు ప్రదర్శనలో ఉపయోగించే చోండ్కావాద్యాన్ని చర్మం , తంత్రీతో కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ గిరిజనులు ఉపయోగించే చర్మవాద్యాలలో అత్యంత ప్రత్యేకమైనది తుడుం వాద్యం. దీనిని గోండు, పర్ధాన్, తోటి, కోలాం తెగవారు ఉపయోగిస్తారు. వీరంతా తుడుం వాద్యాన్ని అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. ఇది సుమారుగా రెండు జానళ్ల వెడల్పు, జానెడున్నర ఎత్తుతో ఉంటుంది. ఓజా అనే ప్రత్యేకమైన జాతితో తయారు చేయించుకుంటారు. దీన్ని తయారు చేయించుకున్నందుకు ప్రతిఫలాన్ని డబ్బులతో కాకుండా పశు సంపదను దక్షిణగా ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా నాలుగు కాళ్ల జంతువుల్లో ఆవు దూడను గానీ మేక పిల్లగానీ దానంగా ఇస్తారు. ఓజాలు కూడా 360 మేకులను గోండు జాతి దేవుళ్లకు ప్రతిరూపంగా తుడుం నిర్మాణంలోనే కొట్టి.. పవిత్రంగా తయారు చేసి ఇస్తారు. అందుకే తుడుం ను ఆయా తెగలు అత్యంత పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. దీనికి మందంగా ఉండే ఎద్దు లేదా మెకం లేదా దుప్పి చర్మాన్ని ముడుచుకుంటారు. తుడుం ను గిరిజనం ఆటపాటల్లో.. దేవతల కొలుపుల్లో, పెళ్లిళ్లు, ఊరేగింపులు, ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధానంగా వాయిస్తారు.
గిరిజనుల చర్మ వాద్యాలైన డోలక్, డోలు, మద్దెల, డుమ్కి, తమ్మెడ బాజ, మూగడోలు, కొమ్ము డోలు మొదలైన వాద్యాలకు చర్మాన్ని ముడుసుకున్న తర్వాత డోలు రెండు వైపులా ఒకే రకమైన శబ్దం రాకుండా ఉండేందుకు ఒక పక్కన ఒగ్గం దీనినే ఒంగం లేదా కందెన, ఓం, బోనం అని కూడా అంటారు. దీన్ని డోలుకు ఒక ప్రక్కన పెట్టుకుంటారు. దీని వల్ల డోలును వాయించినపుడు ‘గుమ్ గుమ్’ అని శబ్దం చేస్తుంది. ఈ రకంగా డోలులో రెండు వేరు వేరు ధ్వనులను పలికించే విధంగా తయారు చేసుకుంటారు. ఈ చర్మవాద్యాలలోనే అతి పలుచని చర్మం పొరను ఉపయోగించి కూడా వాద్యాలను ముడుసుకుంటారు. తోటి మరియు పర్దాన్లు ఉపయోగించే కీకిరి, డక్కీ వంటి వాద్యాలకు పలుచని మేక లేదా ఆవు పర్రను ఉపయోగించి ముడుసుకుంటారు. ఇక గోండు గిరిజనులు వాడే గుమేలకు ప్రత్యేకంగా ఉడుము చర్మాన్ని ముడుసుకోవడం విశేషం. ప్రతి వాద్యానికి కింది భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది . ఇక్కడి నుండే శబ్దం బయటికి వస్తుందని, ఆ భాగాన్ని జీవర అని పిలుస్తారు ఆదివాసీలు. అక్కడ వాద్యానికి ప్రాణం ఉంటుందని, బొట్టు పెట్టి పూజిస్తారు గిరిజనులు.
గిరిజనుల్లోని అతి ప్రాచీనమైన పన్నెండుమెట్ల కిన్నెర, తోటి బుర్ర, ఏక్తార తంత్రీవాద్యాల్లో చేదు ఆనపకాయ బుర్రను, ఆడవెదురు బొంగును మాత్రమే ఉపయోగించి తయారు చేసుకోవడం విశేషం. ఈరకమైన వస్తువులను వాద్యం తయారీలో ఉపయోగిస్తేనే తాము చెప్పబోయే కథకు, శృతికి వాద్యం అనుకువుగా శ్రావ్యమైన సంగీతాన్ని పలికిస్తుందంటారు కళాకారులు. తోటి గిరిజన కళాకారులు పన్నెండు మెట్ల కిన్నెరను వాయిస్తూ జంగులింగు కథ, ఎల్లమ్మకథ, కృష్ణలీల, మహాభారతం కథలను చెప్పడంతో పాటుగా తోటి బుర్రను ఉపయోగించి పాండవుల కథలను గానం చేస్తారు. వీరు తోటి బుర్రను భీముని ‘గద’ గా భావించుకొని పూజచేస్తారు. కొందరు బుర్రకు నెమలీకలు అలంకరించుకుంటే లక్ష్మీచేకూరుతుందని విశ్వసిస్తారు. ఈ రకంగా వాద్యాల మీద ఇటువంటి విశ్వాసాలు విరివిగా కనిపిస్తాయి.
ప్రకృతిలో భాగమై అడవితో అల్లుకున్న బంధంగా సాగే గిరిజనం.. అడవి తల్లి ఒడిలో దొరికే వస్తువులతోనే ఈ వాయిద్యాల ను తయారీ చేసుకోవడం ఆనవాయితీ. తోటి గిరిజనులు గోండులకు కథ చెప్పే సందర్భంలో గరిట మాదిరిగా ఉండే రెండు కర్రలతో శబ్దం చేస్తూ వాయించే వాటిని చిటికలు లేదా టిప్లింగ్ అంటారు. వీటి శబ్దం సహజ సిద్ధంగా, శ్రావ్యంగా ఉంటుంది. గోండు గిరిజనులు గుస్సాడీ సందర్భంలో వాయించే గుమేల వాద్యం టపాల్ వాద్యం కర్రతో చేయబడి ఉంటుంది. దీని శబ్దం కూడా సహజ సిద్ధంగా శ్రావ్యంగా వినిపిస్తుంది. కోలాం గిరిజనులు, నాయకపోడు గిరిజనులు ప్రకృతిలో సహజంగా లభించే ఆడ వెదురు బొంగును ఉపయోగించి తయారు చేసుకునే పొడవైన పిల్లనగోవి నుండి వచ్చే సంగీతం అడవంతా మైమరిచిపోయేలా వినిపిస్తుంటుంది. పుట్టుక నుండి చావు వరకు ప్రతి అడుగులోను సంగీతంతోనే సాగడం ఆదివాసీగిరిజనానికే చెల్లింది. అందుకే ఆదిమ జనం అడవిని కలకాలం చల్లగా కాపాడుకునే గిరిజనం.. సంగీతమే ప్రాణం. ఇది వావ్ ఉస్తాద్ అనే లా ఎల్లకాలం సాగే గానం.
-నరేష్ గొల్లన , ఉమ్మడి ఆదిలాబాద్