న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పలు వైద్యా కాలేజీలపై కన్నెర్ర చేసింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని దాదాపు 18 మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ఆంధ్రపదేశ్‌లో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా.. బిహార్‌లో 3, ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి నుంచి 2, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ నుంచి ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. వీటన్నింటికీ యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్‌లు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఎంతో చారిత్రక రికార్డు ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉండటం విశేషం.
కాలేజీల్లో ర్యాంగింగ్ భూతాన్ని అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్- 2009 నిర్దేశించిన అంశాలను దేశంలోని అన్ని కాలేజీలు తప్పనిసరిగా పాటించవల్సి ఉంది. అయితే దేశంలో దాదాపు 18 మెడికల్ కాలేజీలు ఈ నిబంధనలు పాటించలేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ ర్యాగింగ్ డిక్లరేషన్‌ను పొందడంలో ఆయా కాలేజీలు విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న తేదీ నుంచి సదరు వైద్యా కాలేజీలన్నీ 7 రోజుల్లోగా సరైన కారణాలను తెల్పాలని, లోపాల్ని సరిదిద్దేందుకు తీసుకొనే చర్యల్ని వివరిస్తూ లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నిర్దేశిత గడువు లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నియామకాలు, పదోన్నతులపై సూచనల స్వీకరణ గడువు ఫిబ్రవరి 28 వరకు పెంపు.. యూజీసీ
దేశ వ్యాప్తంగా ఉన్నయూనివర్సిటీలు, వీటి అనుబంధ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు, పదోన్నతులకు సంబంధించి రూపొందించిన ముసాయిదా- 2025పై సలహాలు, సూచనలు స్వీకరించే గడువును యూజీసీ ఫిబ్రవరి 28 వరకూ పొడిగించింది. తొలుత విధించిన గడువు ఫిబ్రవరి 5వ తేదీతో గడువు ముగియగా.. అభిప్రాయాలను తెలిపేందుకు మరింత సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తులు రావడంతో వీటిని పరిగణనలోకి తీసుకుంటూ గడువును పెంచినట్లు యూజీసీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.