ప్రతిష్ఠాత్మక అండర్ 19 మహిళల ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 02)న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తెలుగు అమ్మాయి త్రిష మరోసారి అదరగొట్టింది. అండర్ 19 టీ-20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడం వెనుక మన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఉంది. అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ ఆమె అదరగొట్టింది. దీంతో ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. రెండోసారి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది. తొమ్మిది వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 82 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుసగా పెవిలియన్ బాటపట్టారు. స్వల్ప పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ జట్టు కేవలం 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష… భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సత్తాచాటింది. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి జట్టుకు సునాయస విజయాన్ని అందించింది. 3 వికెట్లు తీసి 44 పరుగులు చేసింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది కూడా త్రిషనే. మ్యాచ్ తర్వాత త్రిష మాట్లాడుతూ.. మిథాలి రాజ్ తనకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తనకు సహకరించిన టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలని త్రిష పేర్కొంది. తన తండ్రికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అంకితం చేస్తున్నానన్నారు త్రిష
భారత జట్టు విజయంతో త్రిష ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. తమ బిడ్డ రాణించడమే కాకుండా భారత జట్టుకు విజయాన్ని అందించిందని ఆనందం వ్యకం చేస్తోంది. తన కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్‌లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సాహించారు. కానీ, కూతురు సత్తా, ఉత్సాహం చూసి.. తను క్రికెట్‌కు బాగా సరిపోతుందని గుర్తించారు. త్రిషకు రెండున్నరేళ్ల వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో ఆయనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఐదేళ్ల వయసొచ్చాక తనతోపాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లి.. రోజుకు మూడొందల బంతులను త్రిషకు వేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్‌ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన రెండేళ్ల లోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది.