తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. ఫిరాయింపు విషయంలో వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా శాసన కార్యదర్శి నరసింహా చార్యులు మంగళవారం నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అసెంబ్లీ కార్యదర్శి ఈ నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కోరారు.
2024 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బీఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే బీఆర్‌ఎస్ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది. నిర్ధిష్ట సమయం చెప్పాలంటూ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నరసింహా చార్యులు నోటీసులు ఇచ్చారు.
అయితే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను, తాజాగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్లను తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.