ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తులతో కళకళలాడుతోంది. నిజంగానే యావత్ దేశవ్యాప్తంగా ఓ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడా నలుగురు మాట్లాడుకుంటున్న ఈ విషయాన్నే చర్చించుకుంటున్నారు..యూపీలోని ప్రయాగ్‍రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాను దర్శించుకునే అదృష్టం మాకు ఉందో లేదో అనుకుంటున్నారు. ఎలాగైనా సంగమ స్నానానికి మన జన్మ ధన్యం అయినట్టే అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వచ్చిన ఓ వార్త ప్రజల్ని కాస్త ఉలిక్కి పడేలా చేసింది. కోలాహలంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుంభమేళాకు వచ్చిన భక్తులు వేసుకున్న గుడారాల్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలటంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 40 గుడిసెలు, ఆరు గుడారాలు దగ్ధమయ్యాయి. కాగా, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు సాగించారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ తెలిపారు. మహాకుంభమేళా ప్రాంతంలో పాత, కొత్త రైల్వే వంతెనల మధ్య ఉన్న సెక్టార్ 19లోని కరపత్రిజీ క్యాంపు సమీపంలోని గీతా ప్రెస్ క్యాంపులోని వంటగదిలో సాయంత్రం 4:10 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో ఎక్కువ దూరం వ్యాపించాయి. అలా అంటుకున్న మంటలు శ్రీ సంజీవ్ ప్రయాగకు చెందిన గుడిసెలు, గుడారాలను ధ్వంసం చేసింది. అగ్నిమాపక దళం సిబ్బంది, పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేసేందుకు పదిహేను అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపారు. ప్రతి ఒక్కరినీ సురక్షితంగా అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారని అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ తెలిపారు.
ఈ మేరకు.. అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ప్రయాగ్‌రాజ్), భాను భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక పరికరాలతో మంటలను వేగంగా ఆర్పివేశామని చెప్పారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్టుగా గుర్తించారు. దీంతో ముందుస్తుగానే అప్రమత్తమైన యంత్రాంగం… ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు గానూ ప్రమాద స్థలంలోని అన్ని గ్యాస్ సిలిండర్‌లను అక్కడ్నుంచి తరలించివేసినట్టుగా చెప్పారు. గీతా ప్రెస్ క్యాంపులోని కిచెన్‌లో చిన్న సిలిండర్‌తో టీ తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ప్రమాద జరిగిన వెంటనే అక్కడ నెలకొన్న గందరగోళం మధ్య ఒక వ్యక్తి అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతని కాలికి గాయమైందని చెప్పారు. అతడు అపస్మారక స్థితిలో వెళ్లటంతో వెంటనే అతన్ని ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ మెడికల్ కాలేజీలో చేర్చారు.అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా మేరకు.. 45 రోజుల మహా కుంభ్ జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. అధికారుల ప్రకారం, ఈ కార్యక్రమం కోసం 1.6 లక్షల టెంట్లు, 50,000 దుకాణాలు ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం ఒక్కరోజే దాదాపు 46.95 లక్షల మంది యాత్రికులు సంగమాన్ని సందర్శించారు. ఇప్పటివరకు మొత్తం 7.72 కోట్ల మంది యాత్రికులు వచ్చారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు మహా కుంభమేళ సందర్భంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ అంచనా వేసింది. ఒక్క పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..