ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంశంగా మారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సంస్థను పునరుద్ధరించేందుకు ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు రూ. 35 వేల రుణభారం, నష్టాలతో సతమతమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేటీ కేటాయించింది. ఈ మొత్తం సరిపోదని, ఇది మొదటి ప్యాకేజి మాత్రమేనని కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేశారు. అయితే మొదటి ప్యాకేజితో ఆగస్టు వరకు సంస్థలోని 3 బ్లాస్టింగ్ ఫర్నేస్‌లను పనిచేయిస్తూ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యమని, తద్వారా సంస్థలను లాభాల బాట పట్టిస్తూ మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటూ పోతూ గాడిలో పెట్టాలన్నది తమ లక్ష్యమని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ టీవీ9తో తెలిపారు. పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన RINLలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటీకరించాలని గతంలో నిర్ణయించిన కేంద్రం.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుందని స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ 3 చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో వెనక్కి తగ్గి.. ఆ చట్టాలను ఉపసంహరించుకోవడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో రెండోసారి తన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తగ్గినట్టయింది.
అయితే కేంద్ర నిర్ణయంపై అసలు చర్చ వేరే ఉంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగ సంఘాలు.. వీలైతే సంస్థకు ఉద్దీపన ప్యాకేజి ప్రకటించి ఆదుకోవాలని, లేదంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL)లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా లాభాల్లో నడుస్తున్న సెయిల్‌లో విలీనం చేస్తుందనే అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఉద్దీపన ప్యాకేజి ప్రకటించడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
విలీనానికి సెయిల్ షరతులు..?
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఆ సంస్థ తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ విలువను ప్రభావితం చేస్తుంటాయి. ఏకంగా రూ. 35 వేల రుణభారం, బకాయిలతో సతమతమవుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ టేకోవర్ చేస్తే.. ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ ప్రభావితమవుతుంది. సంస్థ ఆస్తులు, అప్పుల్లో RINL వాటా చేరుతుంది. తద్వారా SAIL షేర్ల విలువ పడిపోతుందని ఆ సంస్థ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)ను టేకోవర్ చేయాలంటే.. ముందు ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ సరిచేయాలని షరతు పెట్టినట్టు తెలిసింది. వాటిలో నష్టాలు, అప్పుల భారాన్ని తగ్గించాలన్నది మొదటి కండిషన్‌గా తెలిసింది. రెండోది.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని కూడా షరతు పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే.. అక్కడ ఒక ఉద్యోగానికి నలుగురు (1:4) నిష్పత్తిలో నియామకాలు జరిగాయని.. ఉద్యోగుల భారం కూడా సంస్థ నష్టాలకు కారణమన్నది సెయిల్ అభిప్రాయంగా కనిపిస్తోంది. సెయిల్‌లో కూడా ఒకప్పుడు 2 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారని, అప్పుడు సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 12 మిలియన్ టన్నులు మాత్రమే ఉండేది. కానీ స్టీల్ రంగంలో ప్రైవేట్ సంస్థలు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తూ లాభాల్లో దూసుకెళ్తుండడంతో.. సెయిల్ కూడా ఉద్యోగులపై కోత పెడుతూ వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) సహా వివిధ మార్గాల్లో 2 లక్షల నుంచి ప్రస్తుతం అటూ ఇటుగా 50 వేల మందికి కుదించింది. అదే సమయంలో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 20 మిలియన్ టన్నులు దాటింది. అలా సెయిల్ లాభాల బాట పట్టింది. ఉద్యోగుల సంఖ్యను మరింత కుదించి 35 వేల మందికి తీసుకురావాలన్నది ఆ సంస్థ లక్ష్యంగా తెలిసింది.
ఇలాంటి ప్రణాళికల్లో ఉన్న సంస్థ దాదాపు ఖాయిలాపడ్డ స్థితిలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను నేరుగా టేకోవర్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందింది. అందుకే ముందు సంస్థ బ్యాలెన్స్ షీట్‌ను సరిచేసి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించి.. ఆపరేషనల్ ప్రాఫిట్‌లోకి తీసుకొస్తే అప్పుడు టేకోవర్ చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ విలువను గణిస్తే.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న నష్టాలు, అప్పుల కంటే ఎక్కువే. అయినప్పటికీ.. సంస్థను కాస్త సరిదిద్దిన తర్వాతనే టేకోవర్ చేయాలని సెయిల్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సెయిల్ షరతులకు తగ్గట్టే ఓవైపు ఉద్దీపన ప్యాకేజితో పాటు మరోవైపు వీఆర్ఎస్ ద్వారా ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను తగ్గించే చర్యలు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కనిపిస్తున్నాయి. అంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో సెయిల్‌లో విలీనమయ్యే అవకాశాలున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. కేంద్ర మంత్రుల మీడియా సమావేశంలో ఈ అంశంపై వారిచ్చిన సమాధానం కూడా ఇదే మాదిరిగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమన్న వాదనను తోసిపుచ్చుతూ.. సంస్థకు ఒడిశాలో క్యాప్టివ్ మైన్స్ (సొంత గనులు) ఉన్నాయని, కాకపోతే ఇప్పటి వరకు అక్కడ మైనింగ్ కార్యాకలాపాలు ప్రారంభించలేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఏదేమైనా.. ఈ ఉద్దీపన ప్యాకేజితో సంస్థ మళ్లీ గాడిలో పడితే.. “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” భవిష్యత్తులో ప్రైవేటుపరం కాకుండా నిలదొక్కుకుంటుంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ఉద్దీపన్ ప్యాకేజీలు అంటే.. సామాన్య ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టిన పన్నుల సొమ్మే అన్న విషయాన్ని సంస్థ ఉద్యోగులు, యాజమాన్యం మర్చిపోరాదు.