హిందూ శాస్త్రాల్లో శనివారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నవ గ్రహాల్లో ఎంతో ముఖ్యమైన శని దేవుడిని ఈ రోజున ఆరాధిస్తే కష్టాలను రూపుమాపి సకల శుభాలను కలుగజేస్తాడని ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు. అయితే శనివారం రోజున తెలిసీ తెలియక చేసే కొన్ని పనుల వల్ల కష్టాలను కోరి తెచ్చుకుంటుంటారు. అసలు ఈ రోజున పాటించాల్సిన నియమాలు, అస్సలు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం..
వారిని చిన్నచూపు చూడకండి..
సహజంగానే శని దేవుడు శ్రామికులకు కారకత్వం వహిస్తాడు. ఎవరైతే తమ శ్రమను నమ్ముకుని ఒళ్లొంచి పనిచేస్తారో వారిని ఈ గ్రహం ఎట్టిపరిస్థితుల్లోనూ బాధించదని చెప్తారు. రోడ్లు శుభ్రం చేసే కార్మికులు, కూలీలు, విపరీతమైన శ్రమకోర్చి పనిచేసేవారందరికీ శనిదేవుడే కారకుడు. అయితే, శనివారం రోజున తెలిసీ తెలియక కూడా ఇటువంటి కార్మికులను కష్టపెట్టకూడదు. అలాంటి వారు శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వారిని ఆదిరించి వారి పట్ల మర్యాదతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని దగా చేయడం, తూలనాడటం చేయరాదు. ఒకవేళ జాతకంలో ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఈ రోజున వారికి చేతనైనంత మేర సాయం చేయడం, అన్నదానం చేయడం వంటి చేస్తే వారు ఈ గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారనేది గురువులు సూచిస్తున్న పరిష్కారం.
వాటిని శుభ్రం చేస్తున్నారా?
ఎవరైతే తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారిని శని దేవుడు బాధించడు. ఎక్కడైతే అపరిశుభ్రత తాండవిస్తుందో అక్కడ వ్యక్తులు అనారోగ్యాల బారిన పడుతుంటారు. డబ్బు ఇంట నిలవదు. నిత్యం గొడవలతో ఆ ఇంట్లోని వారంతా మనశ్శాంతిని కోల్పోతారు. అందుకే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మిగిలిన వారాల కన్నా శనివారం అనువైన రోజు. ముఖ్యంగా ఇంట్లోని సింకులు, బాత్రూంలను ఈ రోజున శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శని కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలు, ఇబ్బందులు ఆ ఇంట్లోని వారిని ఏమీ చేయలేవట.
తల స్నానం చేయవచ్చా?
శనివారం రోజున తలకు నూనె రాసుకోవడం, నువ్వుల నూనెను కొని తీసుకురావడం మంచిది కాదంటారు. మరి శనివారం రోజున తలస్నానం చేయొచ్చా అని చాలా మంది సందేహిస్తుంటారు. నిజానికి ఈ రోజున తలస్నానం ఎంతో శ్రేష్ఠమైనదిగా చెప్తారు. మంగళవారం చేసే తల స్నానాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. అలాగే శనివారం రోజున తలస్నానం చేస్తే శని దేవుడి కారణంగా భోగభాగ్యాలను పొందుతారని చెప్తారు.
పెద్ద వారితో జాగ్రత్త..
ఇంట్లోని పెద్దలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులకు కూడా శనిదేవుడే కారకుడు. ఈ రోజున వారికి దగ్గరుండి సేవ చేయడం, పెద్ద వారి ఆశీస్సులు పొందడం ఈ గ్రహాన్ని ఎంతో తృప్తి పరుస్తుందట. అలాగే రోడ్డున పోయే ముసలివారికి భోజనం పెట్టడం వల్ల కూడా శని దేవుడి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్తారు. అలాగే ఎవరైతే ఇంట్లోని పెద్ద వారిని చీదరించుకోవడం, వారిని హింసించడం వంటివి చేస్తే ఏలినాటి శని సమయంలో ఈ గ్రహం వారిని అష్టకష్టాలపాలు చేస్తుంది.