గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడత తీవ్రతరం అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజురోజుకు కోతుల బెడత ఎక్కువ అవుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో అన్ని సమస్యలకంటే కోతల సమస్యే ప్రధానంగా మారింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచి సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కోతుల సమస్య తీరిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు ప్రజలు. దాంతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వీటన్నింటిని పక్కనబెట్టి ఇప్పుడు కోతుల సమస్యపైనే దృష్టి సారిస్తున్నారు ప్రజలు. ఈ కోతుల సమస్యను ఎవరు తీరిస్తే వారికే ఓటేస్తామంటూ చెబుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యల కంటే కోతుల సమస్యే ప్రధాన సమస్యగా మారింది. కోతుల వల్ల గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది ప్రజలు వాపోతున్నారు. ఇంటిపై పెంకులు ఊడకొట్టడం, ఇంటి ప్రజలపై దాడులు చేయడం, ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను, ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలతో పాటు తిను బండారాలను సైతం ఎత్తుకెళ్తున్నాయి. వాటిని ఎదురించుదామన్నా దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమకే ఓటు వేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్యే ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు. కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్‌గా కానీ ఎంపీటీసీగా కానీ గెలిపిస్తామంటూ ఓటర్లు తెగేసి చెబుతున్నారు. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు కోతులను పట్టించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే కోతుల విషయంలో ముందుగానే తీర్మానాలు చేస్తున్నారు.
కోతులను పట్టించిన వ్యక్తినే సర్పంచ్‌గా గెలిపించారు
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద తీర్చినందుకు హనుమకొండ జిల్లాలో ఒకరిని సర్పంచ్‌గా గెలిపించారు. అలాగే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ రోజుకో వేషం వేసుకుని కోతులను గ్రామం నుంచి తరిమేశాడు. గ్రామంలో అందరికి సహకారంతో కొంత విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతుల పట్టే వారిని పిలిపించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఇలా చేయడంతో వారు అప్పటి ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇప్పుడు మిగితా గ్రామాల్లో ఇదే కొనసాగుతోంది. కోతుల బెడదను తీర్చిన వారికే ఓటేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. గ్రామాల్లో లక్షలాది కోతులు ఉన్నాయని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది పెద్ద సమస్యగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి