Shakib Al Hasan Check Bounce Case: బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు గత కొన్ని రోజులుగా ఎంతో బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధమని తేలింది. ఆ తర్వాత అతనిపై నిషేధం విధించారు. బౌలింగ్ యాక్షన్ టెస్టులో ఇప్పటికి రెండుసార్లు విఫలమయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బంగ్లాదేశ్ జట్టులో ఎంపిక కాలేదు. వీటన్నింటి మధ్య షకీబ్ అల్ హసన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో షకీబ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ..
వాస్తవానికి, ఐఎఫ్‌ఐసీ బ్యాంక్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, రాజకీయ నాయకుడు షకీబ్ అల్ హసన్‌పై ఢాకాలోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వారెంట్‌లో మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జియాదుర్ రెహమాన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 15న చెక్ ఫ్రాడ్ కేసులో షకీబ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 18న ప్రాథమిక విచారణ అనంతరం జనవరి 19న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. షకీబ్ కంపెనీ అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఘాజీ షాగీర్ హుస్సేన్, డైరెక్టర్లు ఇమ్దాదుల్ హక్, మలైకర్ బేగం కూడా ఈ కేసులో ప్రమేయం కలిగి ఉన్నారు.
ఐఎఫ్‌ఐసీ బ్యాంక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ షాహిబుర్ రెహమాన్ ఈ కేసును దాఖలు చేశారు. దీని ప్రకారం, షకీబ్ అల్ హసన్, మరో ముగ్గురు రెండు వేర్వేరు చెక్కుల ద్వారా సుమారు 41.4 మిలియన్ టాకా అంటే సుమారు 3 కోట్ల భారతీయ రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. కానీ, అతను అలా చేయడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనిపై చర్య తీసుకున్నారు. షకీబ్ కంపెనీ IFIC బ్యాంక్ బనానీ బ్రాంచ్ నుంచి చాలా సార్లు రుణం తీసుకుందంట.
విదేశాల్లోనే షకీబ్ అల్ హసన్..
బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి సమయంలో షకీబ్ అల్ హసన్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తరువాత, భద్రతాపరమైన సమస్యలతో స్వదేశానికి తిరిగి రావడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం షకీబ్ కుటుంబం అమెరికాలో స్థిరపడినందున బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..