30 ఏళ్ల యువకుడు.. పెళ్లి కాలేదు.. ఫార్మా కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.. ప్రైవేట్ జాబ్.. అయితే.. ఓ రోజు అతను పక్కింటికి చెందిన ఓ యువతిని.. తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.. అలా తీయడం అతని పాలిట శాపమైంది.. ఇది గమనించిన ఆ యువతి అతన్ని నిలదీసింది.. దీంతో ఆమె కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని అతనిపై చేయి కూడా చేసుకున్నారు.. అంతటితో ఆగకుండా.. అతన్ని నిర్భంధించారు.. ఆ తర్వాత యువకుడి కుటుంబసభ్యులకు చెప్పడంతో వారొచ్చి తలుపుతీశారు.. అలా తీయగానే.. కొడుకు విగతజీవిగా వేలాడటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు.. ఇటు యువకుడి మృతితో ఆ కుటుంబం.. అటు యువకుడిని నిర్భంధించిన కేసులో యువతి కుటుంబం.. రెండు కుటుంబాలు విషాదంలోకి వెళ్లాయి..ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
గాజువాక సీఐ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు, పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం.. రెండో కుమారుడు భాస్కరరావు (30).. విశాఖలోని ఫార్మాసిటీలో ఉన్న ఒక కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే.. అతను గాజువాక శ్రీనగర్ సమీప శ్రీరాంనగర్‌లో.. ఓ ఇంట్లో అద్దె ఉంటున్నాడు. ఒక్కడే ఉంటూ డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. శనివారం ఉదయం పక్కింటి యువతిని వీడియో తీశాడు.. అది గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కరరావును నిలదీశారు. వీడియోను డిలీట్ చేయించి చేయి చేసుకున్నారు.. అంతటితో ఆగకుండా భాస్కరరావును ఇంట్లో నిర్బంధించారు.
అనంతరం గది బయట తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి చూడగా గదిలోని కేబుల్ వైరుతో ఉరేసుకుని కనిపించాడు భాస్కరరావు.. అప్పటికే అతను చనిపోయిన ఉన్నట్లు గుర్తించారు..
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ విషయం తెలుసుకున్న సీఐ పార్థసారథి, ఎస్‌ఐ నజీర్ అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తమ కుమారుడిని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..