మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్‌పై బీసీడీ ప్రస్తుతం 20 శాతం ఉండగా కేంద్రం దాన్ని 15 శాతానికి తగ్గించింది. దీంతో హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లతో సహా దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాల ధరలు తగ్గుతాయి. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అయితే తాజా తగ్గింపు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగు అని నిపుణులు చెబుతున్నారు. భారతదేశ ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచే కేంద్రం చర్యలు హర్షణీయమని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లు, పీసీబీఏ, ఛార్జర్‌లపై బీసీడీను తగ్గించడంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీకి ఇన్‌పుట్‌లు, ముడి పదార్థాలపై మినహాయింపులను పొడిగించడం వల్ల దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు.
కస్టమ్స్ సుంకం తగ్గింపు తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదని భావిస్తున్నారు. అయితే కొంత మంది నిపుణులు రిటైల్ ధరలపై ఈ తగ్గింపుల ప్రభావం పెద్దగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం చర్యలతో ఈ తగ్గింపులు స్మార్ట్‌ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్పంగా తగ్గుతుందని, అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం అనేది తయారీదారులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీపై ప్రభుత్వం దృష్టి సుంకం తగ్గింపులకు మించి విస్తరించింది. ముఖ్యంగా ఈ రంగంలో శ్రామిక శక్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలను కూడా బడ్జెట్‌లో ప్రకటించారు.
గతంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2023లో స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే కెమెరా లెన్స్‌లపై కస్టమ్స్ డ్యూటీని తొలగించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు ఖర్చులను తగ్గించడానికి దోహదపడింది. బీసీడీలో తగ్గింపు ఉన్నప్పటికీ బ్రాండ్‌లు ప్రయోజనాలను అందించాలని నిర్ణయించుకుంటాయో? లేదో? చూడటానికి వినియోగదారులు వేచి ఉండాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దిగుమతి చేసుకున్న పరికరాలు, భాగాలు చౌకగా మారినా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి ఈ తగ్గింపులు తయారీదారులకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్థానిక తయారీ రంగానికి కేంద్రం నిర్ణయం మరింత ఊతం ఇస్తుందని, అలాగే భారతదేశ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు సంబంధించిన దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి