Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్‌లలో ప్రారంభం కానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి. టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో క్రికెట్ అభిమానులు ఈ ICC టోర్నమెంట్ ఉత్కంఠతను చూడబోతున్నారు. అయితే, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అనేక వివాదాలు తలెత్తాయి. అందులో 5 ప్రధాన వివాదాలను ఓసారి పరిశీలిద్దాం..
1. పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా నిరాకరణ: చాలా కాలం తర్వాత, పాకిస్తాన్ ఐసిసి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా టీం ఇండియా పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించింది. ఆ తరువాత ఐసిసి హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. భారత జట్టు ఇకపై తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. టీం ఇండియా సెమీఫైనల్స్‌కు చేరుకుని, ఆ తర్వాత ఫైనల్స్‌కు చేరుకున్నా, ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరుగుతాయి. లేకుంటే అవి పాకిస్తాన్‌లోనే జరుగుతాయి.
2. పాకిస్తాన్ కూడా భారతదేశానికి రావడానికి నో: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లడానికి భారతదేశం నిరాకరించినప్పుడు, పాకిస్తాన్ కూడా తన కఠిన వైఖరిని ప్రదర్శించింది. రాబోయే ఐసిసి టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టు భారతదేశానికి వెళ్లడానికి కూడా నిరాకరించింది. భారతదేశం లాగే, పాకిస్తాన్ కూడా తన మ్యాచ్ కోసం హైబ్రిడ్ మోడల్‌ను డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
3. ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై వివాదం: 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళా క్రీడలను నిషేధించారు. దీని కారణంగా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కూడా రద్దు చేశారు. మహిళలు బయటకు వెళ్ళే హక్కు, వారి విద్య, అన్ని రకాల హక్కులు తీసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లాండ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని అభ్యర్థిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB)కి ఒక లేఖ రాశారు. అయితే, ECB దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాని రాజకీయ నాయకుల ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.
4. టీం ఇండియా జెర్సీపై గందరగోళం: సాధారణంగా టోర్నమెంట్ నిర్వహించే దేశం పేరు అన్ని జట్ల జెర్సీలపై ఉంటుంది. కానీ, భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండదని నివేదికలు వచ్చాయి. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే, తరువాత టీం ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉంటుందని స్పష్టమైంది. ‘మేg ఐసీసీ మార్గదర్శకాలను అనుసరిస్తాం’ అని బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అన్నారు.
5. భారత మ్యాచ్ రిఫరీ, అంపైర్ల వివాదాలు: ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. కానీ, అందులో ఒక్క భారతీయుడి పేరు కూడా లేదు. నివేదిక ప్రకారం, భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జాబితాలో భారత అంపైర్ నితిన్ మీనన్‌ను చేర్చాలని కోరుకుంది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల నితిన్ పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించాడు. ఇదిలా ఉండగా, భారత మాజీ ఆటగాడు, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో సెలవు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..