వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏడో అతి పెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఉంది. దీని ఎగుమతులు 2024 ఆర్థిక సంవత్సరంలో 1.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020-21లో జరిగిన 719.42 మిలియన్ల డాలర్లతో పోల్చితే ఇవి దాదాపు రెట్టింపు అయ్యాయి. మన కాఫీ ఉత్పత్తిలో దాదాపు మూడు వంతులు అరబికా, రోబస్టా బీన్స్ ఉంటున్నాయి. ఇవి కాల్చని బీన్స్ గా ఎగుమతి అవుతాయి. అయితే కాల్చిన, తక్షణ కాఫీ తదితర విలువ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో కాఫీ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2012లో 84 వేల టన్నులు ఉండగా, అది 2023 నాటికి 91 వేల టన్నులకు చేరింది. అలాగే కాఫీని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కర్ణాటక ముందంజలో నిలిచింది. అక్కడ 2022-23లో 248.020 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు నిలిచాయి.
ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఐసీడీపీ) ద్వారా కాఫీ సాగు విస్తరణకు, దిగుబడి పెంచడానికి, రైతులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సాంప్రదాయేతర ప్రాంతాలలో సాగును విస్తరించడం, సాగును ప్రోత్సహించడం వంటి విషయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. అరకు లోయలో పెరిగిన కాఫీ ఉత్పత్తి దీని ప్రధాన విజయంగా చెప్పుకోవచ్చు. అక్కడ కాఫీ బోర్డు, ఇంటిగ్రేటెట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) సహకారంతో 1.50 లక్షల గిరిజన కుటుంబాలు కాఫీ ఉత్పత్తిని 20 శాతం పెంచాయి. అంతర్జాతీయంగా కాఫీ ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది.
అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఫిన్ లాండ్ తదితర దేశాలపై వ్యాపారానికి వీలుగా కొన్ని రాయితీలు కల్పిస్తోంది. మన రాష్ట్రంలో అరకు కాఫీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అరకు లోయలోనే గిరిజనులు దీన్ని సాగు చేస్తారు. 2018లో పారిస్ లో జరిగిన పోటీలో అరకు కాఫీకి బంగారు పతకం దక్కింది. దీనికి ఇంటర్నేషనల్ బ్రాండ్ గా గుర్తింపు వచ్చింది. అరకు కాఫీని రుచి చాలా అద్బుతంగా ఉంటుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఎకరంలో కాఫీ తోట నుంచి రైతులకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఆదాయం లభిస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి