మీ క్రెడిట్ రిపోర్టును చివరిగా ఎప్పుడు తనిఖీ చేశారని ప్రశ్నిస్తే చాాలా మంది నుంచి గుర్తు లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వారు దాన్ని పరిశీలించి ఎంతో కాలం గడిచిపోయి ఉంటుంది. కొందరైతే ఒక్కసారి కూడా చూసుకుని ఉండరు. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల రోగాలు ముదురుపోతున్నట్టే.. క్రెడిట్ రిపోర్టు చూసుకోకపోవడం వల్ల పలు ఇబ్బందులు కలుగుతాయి. దానిలో చిన్న పొరపాట్ల కారణంగా బ్యాంకు రుణాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా సొంత ఇల్లు, కారు, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేసినప్పుడు రుణాల కోసం బ్యాంకులో దరఖాస్తు అందిస్తాం. జీతం బాగానే వస్తున్న కారణంగా వాయిదాలు చెల్లించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి బ్యాంకు వెంటనే రుణం మంజూరు చేస్తుందని సంబర పడతాం. కానీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్టు సమాచారం వస్తుంది. ఎందుకని ఆరా తీస్తే క్రెడిట్ రిపోర్టు సక్రమంగా లేదని సమాధానం వినిపిస్తుంది.
మన క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్టు ఆధారంగానే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అంటే మీ యోగ్యతను తెలిపే మూడు అంకెల సంఖ్య. అది మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్రెడిట్ రిపోర్టు అంటే మీ క్రెడిట్ చరిత్ర, చెల్లించాల్సిన అప్పులు, క్రెడిట్ కార్డు వినియోగం తదితర వాటితో మీ ఆర్థిక డేటా, గతంలో రుణాలను తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ ను రూపొందించడానికి క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ రిపోర్టు సక్రమంగా లేకపోవడానికి చాలా చిన్నతప్పులు కారణమవుతాయి.
పాత ఖాతాలను గడువు దాటినట్టు లేబుల్ చేయడం, చిన్నచిన్న చెల్లింపులు తప్పిపోవడం అంటే పాత క్రెడిట్ కార్డుకు సంబంధించి చెల్లించని వంద రూపాయలు కూడా కారణమవుతుంది. కొన్ని సార్లు మీరు తీసుకోని రుణాలు కూడా తప్పుగా మీ ఖాతాకు అనుసంధానమవుతాయి. అలాగే క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడడం వల్ల కూడా సమస్య వస్తుంది. క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. తప్పుగా ఏవైనా రుణాలకు మీకు కలిస్తే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. క్రెడిట్ రిపోర్టు ఎప్పుడు బాగుండేలా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి