ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ అందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కఠినమైన జీవనశైలిని అవలంబించవలసి ఉంటుంది. ప్రతిరోజూ ఈ విధమైన దినచర్యను కొనసాగించవల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆహారంలో అన్ని రకాల విటమిన్లు సరైన మొత్తంలో తీసుకోవాలి. దీనిలో ఏదైనా లోపం తలెత్తితే వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని విటమిన్లు సరైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యమైన విటమిన్ల లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ లోపం వల్ల కలిగే సమస్యలలో నిద్ర సమస్యలు ఒకటి. రోజంతా నిద్రపోవడం వల్ల కూడా ఒక రకమైన విటమిన్ లోపం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏ విటమిన్ వల్ల ఇలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మీకు విటమిన్ బి12 లోపం ఉందో లేదో ఎలా తెలుస్తుంది?
విటమిన్ బి12 ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే శరీరంలో దీని కొరత లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో వంటి విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సాధారణంగా శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తితే రోజంతా అలసటగా ఉంటుంది. ఎటువంటి కఠినమైన పని చేయకపోయినా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. పైగా రోజంతా నీరసంగా అనిపిస్తుంది. మీకూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
అంతే కాదు, ఈ విటమిన్ లేకపోవడం వల్ల మానసిక స్థితిలో కూడా పలు మార్పులు వస్తాయి. అలాగే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాగే, జ్ఞాపకశక్తి రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట అలసట, అధిక చెమటలు పట్టడం కూడా విటమిన్ బి12 లోపం వల్ల సంభవించే లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ విటమిన్ లోపం కండరాలను బలహీనపరుస్తుంది. ఇది నిరాశ, నిస్పృహలకు కూడా దారితీస్తుంది. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇవి కూడా చదవండి
శరీరం B12ను సహజంగా ఉత్పత్తి చేయదు. కాబట్టి, ఆహారం ద్వారా మాత్రమే విటమిన్ బి12 పొందాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. విటమిన్ బి12 పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లలో అధికంగా లభిస్తుంది. శాఖాహారులు దీనిని సప్లిమెంట్లు, బలవర్థకమైన ఆహారాల ద్వారా పొందాల్సి ఉంటుంది. సాధారణంగా విటమిన్ బి12 కాలేయంలో 5 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.