ప్రజల కోసం సేవ చేస్తున్న, విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై ఈ సమాజం గౌరవప్రదంగా నడుచుకోవాలి. రాత్రనక పగలనక ప్రజల సేవలోనే నిమగ్నమయ్యే ప్రతినిధుల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. ఇంకేముంది.. కట్ చేస్తే.. కేసు నమోదు కావడంతో పాటు కోర్టు మెట్లు కూడా ఎక్కాడు.
హైదరాబాద్ మహానగరంలోని తార్నాకలో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు పృథ్వీరాజ్ అనే వ్యక్తి. మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన విధుల్లో తాను బాధ్యతాయుతంగా ఉండగా.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ వ్యక్తి మధ్య వేలు చూపిస్తూ.. చేతితో అసభ్యకరంగా సైగలు చేశాడు. ఈ సంఘటన ఈ బుధవారం(ఫిబ్రవరి 5) రోజున జరగగా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీంతో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ సిబ్బంది నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ప్రబుద్ధుడిని నాంపల్లి కోర్టుకి తరలించగా.. పృథ్వీరాజ్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించని వారికి ఇలాంటి పరిస్థితే ఏర్పడచ్చని ఈ సంఘటన హెచ్చరించినట్లుగా మారింది. విధుల్లో ఉన్న ఉద్యోగిని, పైగా మహిళ అనే కనీస జ్ఞానం లేకుండా అసభ్య రీతిలో వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఈ ఘటన ద్వారా స్పష్టమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..