హైదరాబాద్, ఫిబ్రవరి 2: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2025 చివరి విడత దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కావల్సి ఉంది. అయితే జనవరి 31 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి విండో అందుబాటులోకి రాలేదు. ఫిబ్రవరి 1 నుంచి అయినా ప్రక్రియ ప్రారంభమవుతుందని అభ్యర్థులు భావించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో.. అభ్యర్ధులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. చివరి విడత ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య జరుగుతాయి. తాజాగా తొలి విడత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు, జనవరి 30న పేపర్ 2 పరీక్ష జరిగాయి. ఇక చివరి విడత పరీక్ష కూడా ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఫిబ్రవరి 3న ఎప్‌సెట్, ఐసెట్ సమావేశాలు.. త్వరలోనే షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీ సెట్, ఐసెట్ కమిటీ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఈఏపీసెట్, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐసెట్ కమిటీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణలకు సంబంధించిన షెడ్యూల్ రూపకల్పన చేస్తారు. అలాగే ప్రవేశ పరీక్ష దరఖాస్తు, గతేడాది పరీక్షల నిర్వహణ సందర్భంగా తలెత్తిన సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తారు. కాగా ఇప్పటికే ఆయా సెట్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.