ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మూడు రోజులుగా జరుగుతున్న చలి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్, ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో చలి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు అధికారులు. చివరి రోజుతోపాటు.. సెలవు దినం కావడంతో అరకు లోయ చలి ఉత్సవాలను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా.. మాడగడ మేఘాల కొండకు సందర్శకులు క్యూ కట్టారు. దాంతో.. సన్ రైజ్ వ్యూ పాయింట్‌లో సందడి నెలకొంది.
స్వచ్ఛమైన చల్లని వాతావరణం.. ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు.. తెల్లతెల్లవారుతుండగా మంచు తెరలను చీల్చుకొని ఉదయించే భానుడి అందాలు.. మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌లోని సుందర దృశ్యాలు.. ఇలా ఎన్నో అందాలకు కేరాఫ్ అరకులోయ.. ఈ క్రమంలోనే.. అరకులోయలో చలి ఉత్సవ్ పేరుతో ఏపీ ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి వేడుకలు నిర్వహిస్తోంది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, నృత్యాలు, అడ్వెంచర్స్, ఫ్లవర్ షో, కార్నివాల్.. ఇలా మూడు రోజుల ఈవెంట్‌లో రకరకాల ప్రత్యేకతలతో కార్యక్రమాలు చేపట్టింది.
వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు, హాట్ ఎయిర్ బెలూన్ పారా గ్లైడింగ్ లాంటి అడ్వెంచర్స్, తొలిసారిగా హెలి రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలిరోజు నిర్వహించిన గిరిజన కళాకారుల కార్నివాల్ కలర్‌ఫుల్‌గా సాగింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చేపట్టిన కార్నివాల్‌లో జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. కళాకారులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. డోలు వాయించి సందడి చేశారు. ఐటీడీఏ పీవో అభిషేక్ సినిమా పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇలా.. గత రెండు రోజులుగా పర్యాటకుల్లో జోష్ పెంచిన చలి ఉత్సవాలు.. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్, ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో ముగియబోతున్నాయి.