మహిళలకు రోజంతా ఇంటి పనుల్లోనే గడిచిపోతుంది. ఒక్క పనిని పూర్తి చేసుకున్నా, మరో పని ఎదురు చూస్తూనే ఉంటుంది. పనులు త్వరగా ముగిసేలా స్మార్ట్‌గా చేసుకోవాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ చిన్న మార్పులతో మీ టైమ్ మాత్రమే కాకుండా శ్రమ కూడా ఆదా చేసుకోవచ్చు.
ఆయిల్
కొందరికి కొన్నిరకాల వంటనూనెల వాసన అసహనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆవు నూనె, ఆలివ్ ఆయిల్ వాడినప్పుడు. ఈ వాసన పోగొట్టాలంటే, వంటకాలలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి వాసన ఇష్టంలేకపోతే, జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి. ఇలా చేస్తే ఆయిల్ వాసన పూర్తిగా తగ్గిపోతుంది.
చపాతీలు
చపాతీలు, రొట్టెలు చేసిన తరువాత ఐరన్ పాన్ బాగా మురికి అవుతుంది. దాన్ని శుభ్రం చేయడం కొంత కష్టంగా ఉంటుంది. అయితే ఈ కష్టాన్ని తక్కువ కష్టంతోనే తేలికగా అధిగమించవచ్చు. పాన్ ను మీడియం మంట మీద ఉంచి, కొద్దిగా నీళ్లు పోసి, వంట సోడా, ఉప్పు కలిపి అన్ని వైపులా రాయాలి. తర్వాత మట్టి ప్రమిద లేదా నిమ్మకాయ ముక్కతో రుద్దితే పాన్ కొత్తది లా మెరిసిపోతుంది.
ఆపిల్
పిల్లల టిఫిన్ లేదా స్నాక్ టైమ్‌లో ఆపిల్ ముక్కలుగా కోసి పెట్టుకుంటే కొద్దిసేపటికే అవి రంగు మారిపోతాయి. దీన్ని నివారించాలంటే తక్కువ ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్లలో ఆపిల్ ముక్కలను నిమిషం పాటు నానబెట్టి తుడిచివేసి పెట్టండి. ఇలా చేస్తే ముక్కలు చాలా సేపు తాజాగా ఉంటాయి.
క్యాబేజీ
చలికాలంలో క్యాబేజీ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచితే పురుగులు పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించాలంటే క్యాబేజీని సగం కట్ చేసి కాడతో సహా గ్యాస్ మీద ఒక నిమిషం తక్కువ మంటపై వేడి చేయండి. ఇలా చేస్తే క్యాబేజీలో ఉన్న పురుగులు పోతాయి. క్యాబేజీ కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వంటింట్లో పని తక్కువగా అనిపిస్తుంది. పని చేసే సమయం తగ్గి ఆ సమయాన్ని మిగతా పనులకు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఈ చిట్కాలను ఉపయోగించి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి.