హైదరాబాద్, ఫిబ్రవరి 3: పెళ్లి చేసుకోవాలని ఉవ్విళూరుతున్న యువతకు ఇదొక శుభవార్త. ఎప్పుడెప్పుడా శుభ ఘడియలు వస్తాయని ఎదురుచూస్తున్న వారికి ఆ సమయం దగ్గరగా వచ్చేసింది. ఎన్నో కలలతో, ఆశలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, భాగస్వామిని తమ జీవితంలోకి ఆహ్వానించాలని చూస్తున్న వారికి ఇప్పుడు ఇది మంచి పరిణామం. మాఘ మాసం ప్రారంభం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయట. అయితే.. ఇందులో కూడా ముఖ్యంగా ఫిబ్రవరి 16, మార్చి 16 ఈ రెండు తేదీల్లో మరిన్ని ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయని మలక్‌పేటకు చెందిన వాస్తు పండితులు సింగిరి శ్రీనివాస్ తెలియజేశారు.
పెళ్లిళ్ల సందడి మొదలైందంటే చేసుకునేవాళ్లకు సంబరం ఉంటుందేమో కానీ, దాని వల్ల ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుంది. వివాహ శుభ కార్యాలకు సంబంధించి 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. వారికి చేతి నిండా పని దొరుకుతుంది. దీంతో వచ్చే రెండు నెలల్లో సగానికి పైగా రోజులు పెళ్లిళ్ల నిమిత్తం కళ్యాణ మండపాలు బుకింగ్ కూడా అయిపోతున్నాయి. ఇక పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్ల సంగతి చెప్పక్కర్లేదు. వారికి ఈ రెండు నెలలు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిన సంగతే. మరోవైపు.. క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ మొదలైన వాటికి ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే పెళ్లి నిర్ణయించుకున్న వాళ్లు షాపింగ్ మాల్స్ చుట్టూ బట్టలు వంటి కావల్సిన వస్తువులు కొంటున్నారు. దీంతో నగరంలో బడా బడా మాల్స్ వద్ద రద్దీ విపరీతంగా నెలకొంది. షాపింగ్ నిమిత్తం వచ్చేవారితో షాపులన్నీ సందడిగా మారాయి.
ఇవి కూడా చదవండి
శుభ ముహూర్తాల తేదీలు నెలల వారీగా ఇలా..
- ఫిబ్రవరి నెలలో శుభ ముహూర్తాలున్న తేదీలు.. 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25
- మార్చి నెలలో.. 1, 2, 6, 7, 12
- ఏప్రిల్ నెలలో.. 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
- మే నెలలో.. 1, 5, 6, 8,15, 17, 18
- జూన్ నెలలో.. 1, 2, 4, 7
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.