వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సమయంలోనే ఆమె ఇన్‌కమ్ ట్యాక్స్‌కి సంబంధించిన గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపుని ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇకపై పన్ను భారం మోయాల్సిన బాధ తీరిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు.
Nirmala Sitharaman
రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకోవడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం ఉందని PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు నిర్మలా సీతారామన్. ట్యాక్స్ రిలీఫ్ విషయంలో ప్రధాని మోదీ ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్నారని, అందుకే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వగలిగామని చెప్పారు. అయితే..ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని మోదీని ఎలా ఒప్పించగలిగారు అని అడగ్గా..ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఆర్థిక మంత్రి. ప్రధాని మోదీ ఎప్పుడూ మధ్యతరగతి గురించే ఆలోచిస్తారని, ఆయనను కన్విన్స్ చేయడానికి పెద్దగా కష్టపడలేదని వివరించారు. కాకపోతే..వేరే రకంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా..వాటిని చక్కదిద్దగలిగానని అన్నారు.
నిజానికి ఈ ట్యాక్స్ శ్లాబ్‌లను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోందని చెప్పారు నిర్మలా సీతారామన్. డైరెక్ట్ ట్యాక్స్‌ల భారాన్ని వీలైనంత వరకూ తగ్గించాలని చూసినట్టు తెలిపారు. ట్యాక్స్ కట్టడాన్ని చాలా మంది ఓ గౌరవంగా భావిస్తున్నారని, వాళ్లు గౌరవానికి తగ్గట్టుగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల మనసు తెలుసు కుంటారని, వాళ్ల మాటలు వింటారని అన్నారు నిర్మలా సీతారామన్. అందుకే ట్యాక్స్ మినహాయింపు ఇవ్వగలిగామని వెల్లడించారు. ప్రజల కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అని వివరించిన ఆమె..పన్ను తగ్గింపు విషయాన్ని చెప్పగానే ప్రధాని మోదీ అంగీకరించారని అన్నారు. కాకపోతే…కొంత మంది బ్యూరోక్రాట్స్‌ని ఒప్పించడానికే చాలా సమయం పట్టిందని తెలిపారు. “మధ్యతరగతి ప్రజల విన్నపాలను విన్నాం” అని స్పష్టం చేశారు. ఈ పన్ను మినహాయింపు గురించి ఆర్థికమంత్రి ప్రకటన చేసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బల్ల చరిచారు. ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందించారు. కేంద్రమంత్రులు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరవాత ప్రధాని మోదీ ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ దగ్గరకు వెళ్లి అభినందించారు. ఇది ప్రజల బడ్జెట్ అని కితాబునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువుగా పద్దుని రూపొందించారని ప్రశంసించారు. పలువురు కేంద్రమంత్రులు కూడా బడ్జెట్‌పై సానుకూలంగా స్పందిస్తూ…మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..