మూవీ రివ్యూ: పట్టుదల
నటీనటులు: అజిత్, త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్, రవి రాఘవేంద్ర, జీవా రవి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్
ఇవి కూడా చదవండి
ఎడిటర్: ఎన్బీ శ్రీకాంత్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
దర్శకుడు: మగిల్ తిరుమేని
నిర్మాత: సుభాస్కరన్
అజిత్ కుమార్, త్రిష జంటగా వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ విడాముయార్చి. ఇదే సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ఓ వెకేషన్‌లో కలుస్తారు.. తొలి చూపులోనే ప్రేమలో పడతారు.. కొన్నాళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుంటారు. దుబాయ్, అజెర్‌బైజాన్‌లో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే 12 ఏళ్ళ తర్వాత కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంటుంది కాయల్. అదే విషయం అర్జున్‌కు చెప్తుంది. విడాకులు వచ్చేవరకు తనను పుట్టింట్లో ఉంటానంటుంది. అయితే తనే డ్రాప్ చేస్తానని చెప్తాడు అర్జున్. దీనికి ఒప్పుకుంటుంది కాయల్. అలా ఇద్దరూ కార్లో బయల్దేరతారు. దారిలో వెళ్తున్నపుడు ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆగుతారు. అక్కడే కాయల్‌కు దీపికా (రెజీనా), రక్షిత్ (అర్జున్) జంట పరిచయం అవుతారు. దానికంటే ముందు అర్జున్, కాయల్‌ను కొందరు కుర్రాళ్లు రోడ్డు మీద వెంబడిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. పెట్రోల్ పంప్ నుంచి బయల్దేరిన తర్వాత కొంతదూరం వెళ్లాక.. హైవేలో అర్జున్ కారు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అప్పుడే రక్షిత్, దీపికల ట్రక్ అటువైపు వస్తుంది.. కాయల్ వాళ్లతో పాటు వెళ్తుంది. కారు రిపేర్ చేసుకుని వెళ్లిన అర్జున్‌కు ట్రక్‌లో కాయల్ కనబడదు.. అదేంటని అడిగితే తనకు తెలియదని చెప్తాడు రక్షిత్. అసలు కాయల్‌కు ఏమైంది? భార్య కోసం అర్జున్ ఏం చేసాడు..? అసలు రక్షిత్ ఎందుకు అబద్ధం చెప్పాడు అనేది అసలు కథ..
కథనం:
అజిత్ సినిమా నుంచి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా మాస్‌నే కోరుకుంటారు. రొటీన్ సినిమా అయినా పర్లేదు కానీ ఆయనలా ఊర మాస్ సినిమాలో నడిచొస్తుంటే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. కానీ మగిల్ తిరుమేని మాత్రం భిన్నంగా ప్రయత్నించాడు. అజిత్ లాంటి స్టార్ హీరోతో ఎవరూ ఊహించని విధంగా ఓ సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేసాడు. అసలు ఇండియాలో ఒక్క సీన్ కూడా లేదు.. కేవలం దుబాయ్, అజర్ బైజాన్ టూరిజం ప్రమోషన్ కోసమే తీసారా అన్నట్లుంటుంది ఈ చిత్రం. పూర్తిగా అక్కడే చిత్రీకరించాడు దర్శకుడు. పట్టుదల సినిమా అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్రేక్ డౌన్’ సినిమా నుంచి స్పూర్తి పొందారు.. ఓ విధంగా చెప్పాలంటే దానికి రీమేక్ అన్నమాట. మేకింగ్ కూడా పూర్తిగా అక్కడి స్టైలే ఫాలో అయ్యాడు దర్శకుడు మగిల్. కథ పరంగా చూసుకుంటే.. కిడ్నాప్ అయిన భార్య కోసం భర్త ఏం చేసాడు.. కనబడకుండా పోయిన భార్యను మళ్లీ ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది లైన్. రొటీన్ కథే అయినా కూడా పూర్తిగా స్టైలిష్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాడు మగిల్. కాకపోతే అందులో మనకు సోల్ మిస్ అయింది.. ఎమోషన్ పరంగా చాలా వెనకబడింది పట్టుదల సినిమా. పూర్తిగా హాలీవుడ్ స్టైల్‌లో సినిమా సాగడం.. ఎక్కడా మన ఇండియన్ సినిమా ఛాయలు కనిపించకపోవడం దీనికి మైనస్. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇలాంటి కథలు ఎక్కడా ఆగకుండా రేసీగా ఉంటే నచ్చుతాయి.. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లేలో ఆ తడబాటు బాగా కనిపించింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బెటర్. క్లైమాక్స్ పర్లేదు.
నటీనటులు:
అజిత్ నుంచి ఈ తరహా సినిమా ఎక్స్‌పెక్ట్ చేయడం కాస్త కష్టమే. గతంలోనూ వివేకం లాంటి యాక్షన్ సినిమాలు చేసాడు కానీ మరీ ఇలాంటి సినిమా అయితే చేయలేదు. తన వరకు బాగానే చేసాడు అజిత్. ఇక త్రిష తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ కొత్త పాత్రలో మెరిసాడు. రెజీనా కూడా పర్లేదు. మిగిలిన వాళ్లంతా పరిచయం లేని మొహాలే..!
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అంటే నమ్మలేం.. పేరు చూస్తే కానీ అర్థం కాదు. పైగా పాటలు కూడా రెండే ఉన్నాయి. ఆర్ఆర్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. దుబాయ్, అజర్‌బైజాన్ రోడ్స్‌ను చాలా బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండుంటే బాగుండేది. దర్శకుడు మగిల్ తీసుకున్న లైన్ బాగుంది కానీ ట్రీట్‌మెంట్ అంతగా ఆకట్టుకోలేదు. లైకా ప్రొడక్షన్స్ ఖర్చు పరంగా వెనకాడలేదు.
పంచ్ లైన్:
పట్టుదల.. యావరేజ్ యాక్షన్ డ్రామా..!