బీసీ జనగణ తర్వాత జనాభా తగ్గడం పై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎందుకు తగ్గింది అంటూ అటు ప్రజలు, ఇటు బీసీ నేతలు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఓసి జనాభా ఎలా పెరిగిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో ఒక లాజిక్ ఉందంటూ చెప్తున్నారు కొందరు అధికారులు.
దేశవ్యాప్తంగా సగటున ప్రతి జనాభా లెక్కల్లో 13% పెరుగుదల కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదేళ్లకు 13 నుంచి 15% జనాభా పెరుగుతుంది. కానీ విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ కుల గణన లెక్కల్లో మాత్రం బీసీ జనాభా తగ్గింది. మరోపక్క అదర్ క్యాస్ట్ జనాభా పెరిగింది. ఇప్పటివరకు అధికారికంగా ఏ కులం జనాభా ఎంత ఉందనేది ప్రభుత్వం ప్రకటించకపోయినా… అనధికారికంగా కొంత సమాచారం మాత్రం బయటకు వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మున్నూరు కాపు సంఖ్య చాలా మేరకు తగినట్లుగా కనిపిస్తుంది. 2014లో సకుటుంబ సర్వే ఫలితాల్లో మొదటగా ముదిరాజ్, రెండవ స్థానంలో మున్నూరు కాపు, మూడో స్థానంలో గౌడ, నాలుగవ స్థానంలో యాదవ సామాజిక వర్గాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మున్నూరు కాపు సామాజిక వర్గం 4వ స్థానంలో ఉందనేది అనధికార సమాచారం. ఇందువల్లనే మొత్తం బీసీలు తగ్గిపోయారని కొంతమంది నేతలు చెప్తున్నారు.
మరి ఇలా ఎలా జరిగింది?
మున్నూరు కాపులు గతంలో ఓసీ కేటగిరీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కాపులు ఓసి క్యాటగిరీలోనే ఉన్నారు. 1950 తర్వాత తెలంగాణలో మున్నూరు కాపులు గా కాపులోని కొన్ని వర్గాలను గుర్తించి బీసీలలో చేర్చారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో మున్నూరు కాపులకు, రెడ్లకు పెద్ద తేడా ఉండదు. కొన్ని గ్రామాల్లో సంబంధాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మున్నూరు కాపులు చాలామంది రెడ్డి అని పేరు వెనకాల తగిలించుకున్నారు. తాజాగా జరిగిన సర్వేలో రెడ్డి అనే పేరు చివరి అక్షరాన్ని చూసి వాళ్ళందరినీ సర్వేయర్లు ఓసి జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. రెడ్డి అని పేరు చివర్లో తగిలించుకున్న వారంతా మున్నూరు కాపులే అయి ఉండడంతో వారి జనాభా తగ్గిపోయింది. కానీ సాంకేతికంగా పేరు చివర రెడ్డి ఉన్న వాళ్లంతా బీసీ సర్టిఫికెట్ పొంది ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం.
సర్వే చేసేందుకు వెళ్లిన సర్వేయర్లకు ఈ విషయం పూర్తిస్థాయిలో తెలియకపోవడంతో వారిని ఓసి క్యాటగిరీలో చేర్చారు. ఇందువల్లనే తెలంగాణలో బీసీ జనాభా తగ్గి ఓసి జనాభా పెరిగినట్లుగా కనిపిస్తుంది అనేది ఒక ప్రచారం. అసలు మొత్తం జనాభా తగ్గింది అనేది మరో ఆరోపణ. ఇందులో కూడా ఓటర్ లిస్టును ఇప్పుడున్న కులగరణ సర్వే తో పోల్చి చూడడం వల్ల వస్తున్న ఇబ్బంది అని కొంతమంది అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలామందికి రెండు చోట్ల ఓటు ఉండటం వల్ల ఇలా జనాభా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చేవరకు బీసీ జనాభా పై ఆందోళన తగ్గే అవకాశం కనిపించడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి