వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటే చేత పట్టి విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులతో హాస్టల్లో రాత్రి బస చేస్తున్నాడు. తాజాగా తెల్లవారుజామున ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టిన ఆ అధికారి ఏం చేశారో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో జిల్లా యంత్రాంగంలో హల్చల్ చేస్తున్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మిన కలెక్టర్ హనుమంతరావు విద్యాశాఖపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే పనిలో పడ్డారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు. తరగతి గదిలో చాక్ పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలను కూడా బోధిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రభుత్వ హాస్టళ్ళను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహార మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు. తనతో పాటు జిల్లా అధికారులు.. ప్రభుత్వ హాస్టల్లో నిద్రించేందుకు హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
తలుపు తట్టు (వేకప్ కాల్) కార్యక్రమానికి శ్రీకారం..
తాజాగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో ఆయన నిద్రించారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మండలంలోని శేరి గూడెంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపును తట్టి నిద్ర లేపారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో.. భరత్ చంద్ర చారి అంటూ తాను జిల్లా కలెక్టర్ నని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్ర చారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది.
కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ఐదు రూపాయల సొంత డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదువేల రూపాయలను విద్యార్థి భరత్ చంద్ర చారికి అందించాడు. చదువుకునేందుకు స్టడీచైర్ తో పాటు రైటింగ్ ప్యాడ్ ను కలెక్టర్ అందించాడు.
విద్యార్థులకు పదవ తరగతి మైలురాయి
విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మీ అమ్మ.. నిన్ను కష్టపడి చదివిస్తున్నందుకు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి వారికి సంతోషం ఇవ్వాలని విద్యార్థి భరత్ చంద్ర చారికి కలెక్టర్ హితవు పలికారు. పదవ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలి మెట్టు అవుతుందని, కష్టపడి చదివి తల్లితండ్రులు,గురువులు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన సూచించారు. భరత్ జీవితంలో స్థిరపడేవరకు సహకారం అందిస్తానని కలెక్టర్ తెలిపారు.
పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందిః విద్యార్థి భరత్..
జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెల్లవారుజామున మా ఇంటి తలుపు తట్టడం (వేకప్ కాల్)అవాక్కయ్యానిని, కలెక్టర్ గారే స్వయంగా ఇంటికి రావడాన్ని నమ్మలేక పోతున్నానని విద్యార్థి భరత్ చంద్ర చారి చెబుతున్నాడు. తనకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని, మా ఇంటికి కలెక్టర్ రాకతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని భరత్ చంద్ర చెబుతున్నాడు. బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు. మా ఇంటి తలుపు తట్టి తన కొడుకును ప్రోత్సహించడం పట్ల జిల్లా కలెక్టర్ కు విద్యార్థి తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..