నాగరికతకు చిహ్నాలుగా జాతీయ రహదారులను ప్రమాణంగా తీసుకుంటారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన భారత దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన పేరుతో హైవేల నిర్మాణం చేపడుతోంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ట్రాఫిక్ కు 60 శాతం కార్లే కారణమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించింది. ఈ కార్ల ద్వారా వస్తున్న ఆదాయం 20-26 శాతం మాత్రమే వస్తోంది. పదేళ్లలో కొత్తగా టోల్ ప్లాజాలతోపాటు, ఛార్జీలు పెరగడంతో వాహన దారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాహనదారులపై టోల్ ఫీజుల భారాన్ని కాస్తంత తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ప్రైవేట్ కారు ఓనర్లకు సరికొత్తగా ‘టోల్ పాస్ విధానం’ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ టోల్ పాస్ విధానంలో రెండు ఆప్షన్లను వాహనదారులకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరిగానే టోల్ విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది. వార్షిక టోల్ పాస్ రూ. 3000, లైఫ్ టైం టోల్ పాస్ రూ.30 వేలకు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వార్షిక టోల్ పాస్తో ఏడాది పాటు, లైఫ్ టైం టోల్ పాస్తో అన్ లిమిటెడ్గా జాతీయ రహదారులపై కార్లు రాకపోకలు సాగించే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. మధ్య తరగతి కుటుంబాలకు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్న వాహనదారులకు టోల్ భారాన్ని వీలైనంత తగ్గించేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం నెలవారీ టోల్ పాస్ సిస్టం అమల్లో ఉంది. నెలకు 340 రూపాయలు. అంటే.. ఏడాదికి 4,080 రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఖర్చును మరింత తగ్గిస్తూ 3 వేల రూపాయలకే వార్షిక టోల్ పాస్ను తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. మరోవైపు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన దారులందరికీ ఒకేరకమైన టోల్ విధానం అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే టోల్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి