వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని బహుమతులు ఇస్తే సంబంధం దెబ్బతినే అవకాశముందంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని విశ్వసించని వారు ఉన్నా, కొన్ని నమ్మకాలను అనుసరించేవారు కూడా లేకపోలేదు. మరి ఎలాంటి బహుమతులు ఇవ్వడం వల్ల సంబంధానికి ఇబ్బంది కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ పర్ఫ్యూమ్స్ తో సంబంధానికి దూరం..?
పర్ఫ్యూమ్‌లను సాధారణంగా అందమైన బహుమతిగా చూస్తారు. అయితే కొన్ని నమ్మకాలు ప్రకారం వీటిని బహుమతిగా ఇస్తే సంబంధం మసకబారుతుందని చెబుతారు. పర్ఫ్యూమ్‌ల సువాసన క్రమంగా తగ్గినట్లే బంధంలోని ప్రేమ కూడా తగ్గిపోతుందనే నమ్మకం ఉంది. అయినప్పటికీ ఇది వ్యక్తిగత అభిప్రాయమే. కానీ నమ్మకాలను పాటించే వారికి పర్ఫ్యూమ్ బహుమతిగా ఇస్తే అది వారిని అసహజంగా అనిపించవచ్చు.
ప్రేమలో విరహానికి సంకేతంగా కర్ఛీప్స్..?
వాస్తు, కొంతమంది పెద్దవాళ్ల నమ్మకాలు ప్రకారం.. బహుమతిగా కర్ఛీప్స్ ఇవ్వడం విడిపోవడానికి సంకేతమట. కర్ఛీప్స్ కన్నీరు, బాధలను సూచిస్తాయని నమ్ముతారు. ప్రేమలో ఉన్నవారు ఒకరికి ఒకరు కర్ఛీప్స్ బహుమతిగా ఇస్తే అది వారి బంధానికి సమస్యలు తెచ్చిపెట్టవచ్చని కొందరు భావిస్తారు. అయితే ఆధునికంగా చూస్తే ఈ నమ్మకం పూర్తిగా మూఢనమ్మకమే. కర్ఛీప్స్ అందరి ఉపయోగంలో ఉండే సాధారణ వస్తువులే. కానీ మీరు ఎవరైనా ఆ నమ్మకాల్ని గౌరవించే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే అటువంటి బహుమతిని ఇవ్వడం గురించి మరోసారి ఆలోచించాలి.
ప్రమాద సూచికగా షార్ప్ నైఫ్స్..?
కత్తులు, కత్తెరలు లేదా ఏవైనా పదునైన వస్తువులు ప్రేమికులకు ఇవ్వడం వల్ల బంధంలో చీలికలు వస్తాయని చెబుతారు. వాస్తు ప్రకారం ఇటువంటి పదునైన వస్తువులు సంబంధానికి సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందట. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించే అవకాశముందని కూడా కొందరు విశ్వసిస్తారు. ముఖ్యంగా ప్రేమ బంధంలో ఉన్నప్పుడు ఒత్తిడిని, గొడవలను తగ్గించుకోవడం అవసరం. అలాంటప్పుడు అసలు ఇలాంటి బహుమతులను ఇవ్వాల్సిన అవసరమే ఏమి ఉంది ఆలోచించండి.
వెండి సంబంధాలను మసకబారుస్తాయా..?
బంగారం, వెండి వంటి ఆభరణాలు విలువైనవే కావచ్చు. కానీ వెండి విషయంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వెండి వస్తువులు ముఖ్యంగా ఆభరణాలు, ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచుతాయని, సంబంధాన్ని మసకబార్చుతాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే ప్రేమికులకు వెండి బహుమతిగా ఇవ్వడాన్ని కొన్ని నమ్మకాలు వ్యతిరేకిస్తాయి. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కానీ ఎవరైనా మూఢనమ్మకాలను పాటించేవారైతే అలాంటి వ్యక్తులకు వెండి బహుమతిగా ఇచ్చే ముందు మరోసారి ఆలోచించడమే మంచిది.
చెప్పులు ప్రేమికుల మధ్య దూరానికి కారణం..?
చెప్పులను బహుమతిగా ఇవ్వడం కూడా వివాదాస్పదమైన నమ్మకాలలో ఒకటి. కొన్ని నమ్మకాలు చెబుతున్న ప్రకారం.. చెప్పులు బహుమతిగా ఇచ్చినప్పుడు అది ఇద్దరి మధ్య దూరం పెంచుతుందని భావిస్తారు. అంటే ఒకరికి చెప్పులు బహుమతిగా ఇచ్చిన తర్వాత వారి బంధంలో మనస్పర్థలు రావచ్చనే నమ్మకం ఉంది. అయితే చాలామంది ఈ నమ్మకాన్ని ఖండిస్తూ ఇది కేవలం ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ మీరు ఆ నమ్మకాలను పాటించే వారిని ప్రేమిస్తే అలాంటి బహుమతులను పక్కన పెట్టడం ఉత్తమం.
ఏ బహుమతులు ఇవ్వాలి..?
వాస్తు ప్రకారం ప్రేమ బంధాన్ని మరింత బలపరచేందుకు కొన్ని ప్రత్యేకమైన బహుమతులను ఇవ్వడం మంచిదట. ఎలాంటి ప్రతికూలతను కలిగించని మానసిక ప్రశాంతతనిచ్చే బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఉదాహరణకు సున్నితమైన ప్రేమను సూచించే పుష్పాలు, శుభప్రదమైన దేవుడి విగ్రహాలు మంచి పదబంధాలతో కూడిన లవ్ లెటర్లు ఇవే సంబంధాన్ని గాఢంగా మార్చగలవు. అంతేకాకుండా మీ ప్రేమను చాటడానికి మదనపడకుండా మీ భావాలను స్పష్టంగా చెప్పడం కూడా ఎంతో ముఖ్యమైన విషయం.
ప్రేమకు మూఢనమ్మకాలు అవసరమా..?
ప్రేమలో ఉన్నప్పుడు మనసులో ఉన్న భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని బహుమతులు మంచివి కావు అని నమ్మే వారు ఉన్నప్పటికీ వాటిని పాటించాల్సిన అవసరం లేదు. ప్రేమ, నమ్మకం, గౌరవం బలమైన బంధానికి ఆధారం. కాబట్టి బహుమతుల కంటే మీ ప్రేమను వ్యక్తపరచడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వాలెంటైన్స్ డే మీరు ఇచ్చే బహుమతుల కంటే మీరు చూపించే ప్రేమనే ముఖ్యంగా గుర్తుంచుకోండి.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)