కడుపులో నెట్టుకుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కన్న తల్లి కనికరం లేకుండా నాలుగేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. మాటలు కూడా సరిగ్గారాని చిన్నారి ఒంటిపై అట్లకాడతో కాల్చి వాతలు పెట్టింది. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజుల పాటు ఆ చిన్నారికి నరకం చూపించింది. అయితే ఇదంతా ఎందుకు చేసిందో తెలస్తే హతాసులవుతారు..
Woman Tortured Her Four Year Old Daughter
పల్నాడు, ఫిబ్రవరి 2: కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి కనికరం లేకుండా ప్రవర్తించింది.. అట్లకాడతో ఆ చిన్నారి లేతబుగ్గలపై వాతలు పెట్టింది. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజుల పాటు ఆ చిన్నారి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి ఇళ్లలో పనిచేసుకొని జీవనం సాగిస్తుంది. రైల్వే స్టేషన్ వద్ద తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. భర్త లేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. అయితే నాలుగేళ్ల కుమార్తె గత కొన్ని రోజులుగా ఇంటిలో నుండి బయట రాకపోవడాన్ని స్థానికులు గమనించారు. ఏం జరిగిందోనని ఆరా తీశారు. ఈ చిన్నారి బుగ్గలపై వాతలుండటాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐసిడిఎస్ అధికారులు మాధవి ఇంటి వద్దకు వచ్చారు. ఈ విషయం గమనించిన మాధవి తన కుమార్తె లేదని మహిళా అధికారులకు చెప్పింది. కుమార్తె వారి కంట పడకుండా దాచి పెట్టింది.
అయితే అధికారులు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి తిరిగి మాధవి ఇంటికి వచ్చారు. ఇంటిలో అమాయకంగా ఉన్న ఆ చిన్నారిని పరిశీలించారు. చిన్నారి వంటిపై వాతలుండటంతో మాధవి ప్రశ్నించారు. గత ఐదు రోజులగా.. రోజూ మాధవి కుమార్తె బుగ్గలతో పాటు ఒంటిపై కూడా వాతలు పెడుతున్నట్లు ఆ చిన్నారి చెప్పింది. అయితే మాధవి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుంటాడని.. ఆ సమయంలో ఆ చిన్నారి గోల చేస్తుండటాన్ని.. భరించలేని మాధవి పైశాచికంగా వాతలు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. బాలికను సంరక్షించిన ఐసీడీఎస్ అధికారులు నర్సరావుపేట కేంద్రానికి తరలించారు. మాధవిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారిని హింసించిన ఘటనలో మాధవితో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.