ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది. వేల మంది సైన్యంతో మావోయిస్టు అడ్డా అయిన దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టులను ఏరిపారేస్తోంది. తాజాగా బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ 8 మంది హతమయ్యారు. ఇలా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఈక్రమంలో పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అలాగే కోవర్టులు కూడా పెరిగిపోవడంతో ఎవరిని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్న మావోయిస్టులు పలు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అగ్రనేత హిడ్మాను సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు పార్టీ.. అతని స్థానంలో మరొకరికి దండకారణ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిడ్మాను తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హిడ్మాను తప్పించారా ? లేక ఎన్ కౌంటర్లను అడ్డుకోవడంలో హిడ్మా ఫెయిల్ అయ్యారా? సందేహాలు మొదలయ్యాయి. పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తోందా ? అనే చర్చ కూడా మొదలైంది. ఇక గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా ఒకరు కాగా.. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు కీలక బాధ్యతలు అప్పగించింది మావోయిస్టు పార్టీ.
ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు 54 ఏళ్ల పాటిరామ్ మాంఝీ. అతడి తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఒడిశా కమిటీలో దాదాపు అరడజను మంది కీలక సభ్యులు ఉన్నారని వర్గాలు తెలిపాయి. వీరిలో మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవలి నెలల్లో జరుగుతోన్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో బౌధ్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయిలో మార్పులు జరిగాయని, ఇతర ఏరియా కమిటీల పునర్నిర్మాణం కూడా జరిగిందని సమాచారం.
గతంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా కూడా ఉన్నారని తేలింది. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు పదోన్నతి కల్పించి కీలకమైన స్థానంలో ఉంచారని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఇది ప్రతిబింబిస్తుందని ఈ విషయం గురించి తెలిసిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. కేంద్ర కమిటీతో పాటు తూర్పు దళంలోనూ మార్పులు జరిగాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.