ఎండు చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి ఎముకలు, దంతాల బలానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. కానీ గుండె జబ్బులు, షుగర్, కిడ్నీ, చర్మ సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినకూడదట. ఎండు చేపల గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Dry Fishes
Updated on: Feb 05, 2025 | 7:56 PM
ఎండు చేపల గురించి వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. ఈ చేపలు ప్రత్యేకమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఎండు చేపలు ఆరోగ్యానికి మంచివే అయినా కొందరు మాత్రం వీటిని తినకూడదట. ఎందుకంటే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తింటే అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఆరోగ్య ప్రయోజనాలు
- ఎండు చేపల్లో ఉన్న క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.
- ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి.
- ఎండు చేపలు మహిళల్లో మూత్రాశయం, అండాశయం, గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
- పాలిచ్చే తల్లులు తింటే పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
- ఇందులోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలోని వివిధ అవయవాలకు తగిన పోషణ అందిస్తాయి.
ఎవరు తినకూడదు..?
- గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తినకూడదు.
- ఎండు చేపల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచే అవకాశముంది.
- షుగర్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు మారిపోవచ్చు.
- దద్దుర్లు, పొక్కులు, దురద వంటి సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారు ఎండు చేపలు తినడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.
జాగ్రత్తలు
మజ్జిగ, పెరుగు, ఆకుకూరలతో తినకూడదు. ఇవి కలిపి తింటే జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలకు నూనె రాసుకున్న రోజు తినకూడదు. ముఖ్యంగా జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా సమస్యలు ఉన్నవారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజున ఎండు చేపలు తినకూడదు.
ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే శరీరానికి తగిన పరిమితిలోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది.