ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. రూ.999కి రెండు జతలు.. రూ.5000 బిల్లు చేసిన కస్టమర్‌కి ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇలాంటి ప్రకటనలు తరచూ మనం చూస్తూనే ఉంటాం. అలాగే, పదివేల వస్తువును మొదటి వంద మందికి తక్కువ కేవలం ఒక్కరూపాయికే ఇచ్చేస్తున్నాం ..అంటూ కూడా పలు సందర్భాల్లో వ్యాపారులు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉచితాలను ప్రకటిస్తుంటారు. ఇక వాటి ఆఫర్ల కోసం ఎగబడే జనాల అవస్థలు మాత్రం వర్ణనాతీతంగా మారుతుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాపార ప్రకటనల కారణంగా ప్రజలు గాయపడిన సందర్భాలు, ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు సోషల్ మీడియాలో మనం చూశాం. అలాంటిదే కేరళలో ఒక షూ కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని కన్నూర్‌లో ఓ షూ వ్యాపార సంస్థ తమ అమ్మకాలను పెంచుకోవటం కోసం ఓ గొప్ప ఆఫర్ ప్రకటించింది. ఖరీదైన షూ కొనుగోలు చేసేందుకు ఆ రోజున ముందుగా దుకాణానికి వచ్చిన మొదటి 75 మందికి కేవలం ఒకే ఒక్క రూపాయికే షూస్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో స్థానిక ప్రజలే కాదు.. ఏకంగా అక్కడి పోలీసులే స్పాట్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
షాప్ నిర్వాహకుల ప్రకటన మేరకు ఒక్క రూపాయి నోటుతో దుకాణానికి రావాలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆఫర్‌ను అందించారు. దీంతోపాటు షాపులో ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. యాడ్ రీల్ చూసిన జనాలు బూట్ల కొనుగోలు కోసం దుకాణానికి బారులు తీరారు. షాప్ ఇచ్చిన ఆఫర్ మేరకు మొదట వచ్చిన 75 మందికి బదులు వెయ్యి మందికి పైగా అక్కడకు చేరుకున్నారు. మొదటి 75 మందిలో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే మహిళలు సహా పెద్ద సంఖ్యలో జనాలు దుకాణం ముందు బారులు తీరారు. కన్నూరు నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా దుకాణానికి తరలివచ్చారు.
ఉదయం 11 గంటలకే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. జనంతో రోడ్డు దిగ్బంధం కావడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దుకాణం మూసి వేయడంతో ప్రజలు చెప్పులు తీసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతలో, మల్టీ-స్టోర్ షాప్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తమ ఆఫర్‌ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామంటూ ప్రకటించింది. పోలీసుల రియాక్షన్‌తో షాప్ నిర్వాహకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తర్వాత, మల్టీస్టోర్ షాప్ మరో పోస్ట్ ద్వారా కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. అలాగే, ఒక్కరూపాయి నోట్ కాకుండా మొదటి 75 మందికి ఆన్‌లైన్ ద్వారా షూస్ ఇవ్వాలని పోలీసులు సూచించినట్టుగా షాప్ యజమాని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..