2024 చివరి రోజున ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఓ షాకింగ్ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్తి జిల్లాలోని ఓ గ్రామంలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్ధిని ఎవరూ ఊహించని పని చేసింది. మూఢ భక్తితో ఆమె తన నాలుకను కోసి శివ లింగానికి సమర్పించుకుంది. అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్లిపోయింది. ధ్యానం కోసం ఆలయంలోకి వెళ్లి.. తనకు తాను లోపలి నుంచి తాళం వేసుకుంది.
రెండు రోజుల వరకు తన ధ్యానానికి భంగం కలిగిస్తే తన జీవితాన్ని అంతం చేసుకుంటానని రక్తంతో తడిసిన లెటర్ రాసి బెదిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామస్థులు గుడి చుట్టూ చేరగా, జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, బాలిక ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో గ్రామస్థులు అధికారులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారు.ఎలాగోలా యువతిని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ప్రస్తుతం భోజనం తింటోందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వార్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వైరల్ అయింది. దీంతో బాలిక దైవభక్తి పిచ్చి పీక్ స్టేజీకి చేరిందంటూ నెటిజన్లు మండిపడ్డారు.. బాలికతో పాటు గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని పలువురు కామెంట్ల రూపంలో కోరారు.