చైనా తక్కువ ఖర్చుతో డీప్ సీక్ ఏఐని తయారు చేసి ఉచితంగా అందించింది. దీంతో ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల స్టాక్ పతనమయ్యాయి. ఇంతటి సంచలనం రేపిన డీప్ సీక్ ఏఐ వాడకాన్ని పలు దేశాలు నిషేధించాయి. దానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలుసుకుందాం. చైనా తీసుకువచ్చిన డీప్ సీక్ ఏఐ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరిశ్రమను కుదిపేసింది. చాట్ జీటీపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే ఈ చైనీస్ స్టార్టప్ అనేక నియంత్రణ సంస్థల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. మన దేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను డీప్ సీక్ వాడవద్దని హెచ్చరించింది. దీని వల్ల సమాచార గోప్యతకు ప్రమాదం ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈ టూల్ వినియోగించడం వల్ల డేటా లీక్ అవుతుందని భావిస్తోంది. మనతో మరికొన్ని దేశాలు కూడా డీప్ సీక్ ఏఐని నిషేధిస్తూ చర్యలు తీసుకున్నాయి. దానిపై పూర్తిస్థాయిలో లేదా ప్రభుత్వ వినియోగ నిషేధం ఉన్న దేశాలు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటలీ
ప్రపంచంలోనే డీప్ సీక్ ఏఐని నిషేధించిన మొదటి దేశం ఇటలీ. గత నెలలోనే ఈ మేరకు చర్యలు తీసుకుంది. దేశంలోని యాప్ స్టోర్ల నుంచి యాప్ ను తొలగించింది. ఆ స్టార్టప్ యూజర్ డేటాను ఎలా నిర్వహిస్తారనే దానిపై ఇటలీ గోప్యతా వాచ్ డాగ్, ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీపీఏ) సమాచారం కోరిన తర్వాత ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.
తైవాన్
తైవాన్ తన ప్రైవేటు పౌరులను డీప్ సీక్ ఏఐ చాట్ బాట్ ను ఉపయోగించకుండా ఇంకా నిషేధం విధించలేదు. కానీ దాని నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం చైనీస్ ఏఐపై నిషేధం ఉంది. తైవాన్, చైనా మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. తైవాన్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. డీప్ సీక్ ఏఐ వల్ల తమ రహస్య సమాచారానికి ప్రమాదం కలుగుతుందని తైవాన్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియా
చైనా డీప్ సీక్ ఏఐపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు డీప్ సీక్ ఏఐ చాట్ బాట్ ను ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాని వల్ల తమ దేశ భద్రతకు ప్రమాదం కలుగుతుందని భయపడుతోంది. అయితే వ్యక్తిగతంగా పౌరులకు మాత్రం నిషేధం లేదు. అయితే చైనా చాట్ బాట్ తో జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి