స్వీడన్‌లోని ఒక పాఠశాలలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించింది. ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాల ఆవరణలో మంగళవారం (ఫిబ్రవరి 4) జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది మరణించారు. ఈ సంఘటన స్వీడన్ చరిత్రలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, కాల్పులు జరిపిన దుండగుడు మరణించిన వారిలో ఉన్నాడు. ఒరెబ్రో నగరంలోని జిల్లా పోలీసు అధికారి రాబర్టో ఈద్ ఫారెస్ట్ ప్రకారం, కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బాధితుల ఖచ్చితమైన సంఖ్యను ఇంకా నిర్ధారించలేకపోతున్నాన్నారు. బాధితుల కోసం పోలీసులు ఇప్పటికీ పాఠశాల ఆవరణలో వెతుకుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండగుడు ఒంటరిగా ఈ కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి తర్వాత అతను కూడా చనిపోయాడని తేలింది. కాల్పులు జరిపిన దుండగుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. అలాగే ముఠాతో సంబంధం లేదు. ప్రస్తుతం, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పుల ఘటనకు సంబంధించి దుండగుడి ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 200 కి.మీ దూరంలో ఉన్న ఒరెబ్రోలోని ఒక పాఠశాల క్యాంపస్‌లో ఈ కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:33 గంటలకు కాల్పుల ఘటన గురించి పోలీసులకు మొదటి సమాచారం అందింది. ఈ సంఘటన రిశ్‌బర్గ్‌స్కా సెకండరీ స్కూల్ విద్యా సముదాయంలో జరిగింది. ఇది ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేయని వారికి విద్యను అందించే కోమ్వాక్స్‌కు చెందినది.
ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. హఠాత్తు పరిణామంతో తరగతి గదుల నుంచి పిల్లలతో సహా బయటకు పరుగులు తీశామన్నారు. ఇప్పటివరకు, కనీసం 10 మంది కాల్పుల్లో మరణించినట్లు నిర్ధారించారు అయితే ఆ సంఖ్య గురించి మరిన్ని వివరాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. స్వీడన్ న్యాయ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
ఒరెబ్రో పోలీసు చీఫ్ రాబర్టో ఈద్ ఫారెస్ట్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. “తుపాకి దాడి చేసిన వ్యక్తి పోలీసులకు తెలియదన్నారు రాబర్టో. అతనికి ఏ ముఠాతోనూ సంబంధాలు లేవన్న ఆయన.. నిఘా వర్గాల సహకారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..