ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో SA20 లీగ్ గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 27వ మ్యాచ్ ముంబై కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగింది. జనవరి 31న జరిగిన ఈ మ్యాచ్‌లో MI జట్టు 27 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంలో డెవాల్డ్ బ్రెవిస్ కీలక పాత్ర పోషించాడు. అతడి తుఫాన్ బ్యాటింగ్ కారణంగా MI జట్టు 222 పరుగుల భారీ స్కోరును సాధించి మ్యాచ్‌లో విజయం సాధించడమే కాదు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
228 స్ట్రైక్ రేట్‌తో 73 పరుగులు..
MI కేప్ టౌన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఆ జట్టు ఓపెనర్లు కేవలం 4.3 ఓవర్లలో 45 పరుగులు చేశారు. ఆ తర్వాత MI తదుపరి 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 228 స్ట్రైక్ రేట్‌తో కేవలం 32 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌తో బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అటు 3వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రీజా హెండ్రిక్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు 44 బంతుల్లో 175 స్ట్రైక్‌రేట్‌తో 77 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి సాయంతో ముంబై భారీ స్కోర్ సాధించింది.
అగ్రస్థానానికి ఎంఐ..
223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్ కాస్త తడబడింది. ఒకానొక దిశలో విజయానికి చేరువ కాగా.. చివరికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రిటోరియాకు మంచి శుభారంభం లభించకపోయినా.. రెండో వికెట్‌కు విల్ జాక్వెస్, విల్ స్మీడ్ 72 పరుగులు జోడించారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ప్రిటోరియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. 27 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఇక ఈ విజయం తర్వాత MI జట్టు 9 మ్యాచ్‌లలో 6 విజయాలతో అగ్రస్థానానికి చేరుకుంది. అటు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. కాగా, ఫిబ్రవరి 4న మొదటి క్వాలిఫయర్‌లో పార్ల్ రాయల్స్‌తో తలబడుతుంది MI జట్టు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి