అమరావతి రాజధాని పరిధిలోని పెనమాక, తాడేపల్లి, ఉండవల్లి, యర్రబాలెం పరిసర గ్రామాల్లో వాణిజ్య పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. నీటి వసతి ఉండటంతో ఇక్కడ ఏడాదంతా పంటలు సాగవుతుంటాయి. పెనమాక పరిసర ప్రాంతాల్లో ఉల్లి సాగు కూడా అధికంగా ఉంటుంది. దిగుబడులు, ధర ఎలా ఉన్న వందల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు రైతులు...ఇక్కడ పండే ఉల్లికి ఘాటు ఎక్కువన్న ప్రచారం కూడా ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు పెనమాక వస్తుంటారు. ప్రస్తుతం రైతుల వద్ద నుండి కేజీ ఉల్లిపాయలను 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో యాభై రూపాయల వరకూ కేజీ ఉల్లి ధర ఉంది.
Onion Bags
అమరావతి రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో పండే ఉల్లి ధర అధికంగా ఉండటంతో పెనమాకలోని ఉల్లిపాయలపై దొంగల కన్ను పడింది. ఉదయం నుండి ఉల్లిని కోసిన కూలీలు వాటిని కుప్పగా పోసి వెళ్లిపోతుంటారు. రైతులు వాటికి కాపలా ఉంటారు. అయితే గత కొద్దీ రోజులుగా రైతుల ఉల్లి పాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోతున్నారు. పెనమాకకు చెందిన రైతు క్రిష్ణారెడ్డి ఈ ఏడాది కూడా ఉల్లి సాగు చేశాడు. సాయంత్రం వరకూ ఉల్లిపాయలను కోసిన కూలీలు వాటిని బస్తాల్లో నింపారు. ఉదయాన్నే వెళ్లి వాటిని మార్కెట్ కు తరలించుదామని రైతు అనుకున్నాడు. అయితే తెల్లవారి వెళ్లిన రైతు అక్కడ ఉల్లి బస్తాలు తక్కువగా ఉండటంతో అవాక్కైయ్యాడు. పంతొమ్మిది బస్తాలను తస్కరించినట్లు గుర్తించాడు. ఆటోలో వచ్చిన దొంగలు అర్దరాత్రి సమయంలో వాటిని తీసుకెళ్లారు. దీంతో రైతు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
గుంటూరు జిల్లాలో గతంలో మిర్చి ధరలు అధికంగా ఉన్నప్పుడు కూడా మిర్చిని దొంగలు దొంగలించేవారు. దొండల బెడద తట్టుకోడానికి ఏకంగా కొంతమంది రైతులు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రాజధానిలోనూ అటువంటి పరిస్థితే వచ్చిందని రైతులు అంటున్నారు. ముఖ్యంగా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో మద్యానికి, గంజాయికి బానిసై వ్యక్తులు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నట్లు అన్నదాతలు చెప్పుకొచ్చారు. పోలీసులు ఇటువంటి వారిపై దృష్టి పెట్టి రైతుల ఉత్పత్తులు దొంగలించకుండా చూడాలని కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..