ఎన్నికల హామీల అమలు, కుల గణనపై విపక్షాల నుండి విమర్శల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో.. నష్టనివారణపై చర్యలు చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీంతో గురువారం(ఫిబ్రవరి 6) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్.
హైదరాబాద్‌లోని MCRHRDలో ఈ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్సీతోపాటు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ హాజరవుతారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనుంది పార్టీ. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ సమావేశంలో మొదటగా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం సమావేశం సీఎల్పీగా మారుస్తారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై సమావేశంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి. MLAలు, మంత్రుల మధ్య సమన్వయం పై సూచనలు చేస్తారు. మరోవైపు, సమావేశంలో తమకు ఒక్కొక్కరికి 5 నిమిషాలు వ్యక్తిగతంగా సమయం ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యేలు.
ఇదిలాఉండగా, ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం..కీలక అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..