న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు తేదీ ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు ఫిబ్రవరి 8 వరకు సీయూఈటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణకు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి CUET (PG) 2025 ప్రవేశ పరీక్షకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఫిబ్రవరి 8వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి 31 తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.
సీమ్యాట్ 2025 ప్రాథమిక కీ విడుదల.. ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)-2025 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలవగా.. దీనిపై ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. త్వరలోనే తుది ఆన్సర్ కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. దేశవ్యాప్తంగా జనవరి 25న 107 నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో సీమ్యాట్ 2025 పరీక్ష జరిగింది. సీమ్యాట్ స్కోరు ఆధారంగా 2025-2026 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
సీమ్యాట్ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.