ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్.. ఏఐ వైపే చూస్తోంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న ఏఐ.. భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తిస్థాయిలో శాసిస్తుందని.. ఫ్యూచర్ అంతా ఏఐదే అని చాలామంది భావిస్తున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు లాంటి వాళ్లు కూడా భవిష్యత్తు ఏఐదే అని పదే పదే చెబుతున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్‌వేర్ రంగాన్ని భవిష్యత్తులో ఏఐ శాసించనుంది.
ప్రస్తుతం జీడీపీలో దాదాపు 7.5శాతం ఈ ఒక్క రంగం నుంచే లభిస్తోంది. 2025 నాటికి ఇది 10శాతానికి చేరొచ్చన్నది నిపుణుల అంచనా. దీనికితోడు ఎడ్యూటెక్ రంగంలో 2030నాటికి ఏఐ మార్కెట్ విలువ 80 బిలియన్ డాలర్లుంటుందని పలువురు లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఏఐ హబ్ కావడానికి అవసరమైన ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. భారత్ కూడా ఏఐ రీసెర్చి, ఇతర అప్లికేషన్లలో ఆధిపత్యం ప్రదర్శించడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
గతంలో వ్యవసాయం, ఆరోగ్యం, సస్టైనబుల్ సిటీస్ రంగాల్లో ఇటువంటి కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా ప్రతిపాదించిన ఎక్స్‌లెన్స్ సెంటర్ విద్యాప్రయోజనాల కోసం వినియోగించనుంది. భారత్‌కు మరో 10 నెలల్లో సొంతంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ వస్తుందని రీసెంట్‌గా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది సొంత టెక్స్ట్‌ను జనరేట్ చేయడం, ఇతర పనులు చేసే ప్రోగ్రామ్. ఇది ఒక రకమైన మెషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. చాట్‌జీపీటీ, డీప్‌సీక్ మోడల్స్ తరహాలో ఇది పనిచేస్తుంది.
ప్రస్తుతం భారత్‌లో ఏఐ మోడల్ 10,000 జీపీయూలను దాటింది. సమీప భవిష్యత్తులో ఇది 18,600 జీపీయూలను లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం డీప్‌సీక్ 2,000 జీపీయూలు, చాట్‌జీపీటీ 4 వెర్షన్‌ను 25,000 జీపీయూలతో అభివృద్ధి చేశారు. ఆరుగురు ప్రధాన డెవలపర్లు కలిసి భారత్‌కు చెందిన ఏఐ మోడల్‌పై పనిచేస్తున్నారు. దీని సంబంధించి తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చేసరికి నాలుగు నుంచి పది నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.
మరోవైపు 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏఐ నుంచి 15.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చైనా, అమెరికాలు ఈ రంగంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. డీప్‌సీక్ పేరిట చైనా తీసుకొచ్చిన జీపీటీ .. అమెరికా అధిపత్యానికి గండికొట్టింది. ఏఐ రేసులో తాము కూడా ముందున్నామని సంకేతాలు ఇచ్చింది.