తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేల సమావేశం వాస్తవమే అని అనిరుధ్ క్లారిటీ ఇస్తే.. అందులో తాను పాల్గొన లేదని వరంగల్ వెస్ట్ ఎమ్మె్ల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. తాను పాల్గొనకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయినా ఎమ్మెల్యేలు భేటీ అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
Mla Naini Letter To Cm Revanth Reddy
అధికార పార్టీ ఎమ్మెల్యేల భేటీ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఆ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు..? ఎందుకు బేటీ అయ్యారనే విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే కూపీ లాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి భేటీలో పాల్గొన లేదని ముఖ్యమంత్రికి లేఖ రాసిన నాయిని రాజేందర్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నివాసంలో భేటీ అయి కేబినెట్‌లోని ఒక మంత్రి వ్యవహారశైలి పైన చర్చించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ మంత్రి పైన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.. రకరకాల ప్రచారం జరిగింది. అందులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అధిష్టానం దూతలు ఆయనతో ఫోన్‌లో సంప్రదించినట్లుగా సమాచారం.. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఆ భేటీ గురించి తనకు తెలియదని స్పష్టం చేసిన నాయిని, ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.
తాను ఎవరితో భేటీలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నాయిని రాజేందర్ రెడ్డి.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంను కలిసి పిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ పై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని లేఖలో పేర్కొన్న నాయిని రాజేందర్ రెడ్డి ఈ కుట్రల వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సోషల్ మీడియా కుట్రలు, యూట్యూబర్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని తెలిపారు. ఒకవేళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్వంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కూర్చొని అబివృద్ధిపై చర్చిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తో చర్చించిన అనంతరం తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..