Maha Kumbh 2025: 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అయితే.. దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వంద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత భారీ ఎత్తున్న భక్తులు కుంభమేళా కోసం వెళ్తున్నారు.
చాలా మంది మార్గమధ్యలోనే ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రయాగ్‌రాజ్ ఏయిర్ పోర్టు నుంచి త్రివేణి సంగమం వరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎకో టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు, ప్లై ఓలా భాగస్వామ్యంతో ఈ హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. విమానం ద్వారా.. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా త్రివేణి సంగమానికి చేరుకోవడానికి వీలు లేకపోవడంతో హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. రోడ్డు మార్గంలో వెళ్తే.. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ కారణంగా గంటలకు గంటల సమయం పడుతోంది.
హెలికాప్టర్ ఖర్చు ఎంత?
ప్రయాగ్‌రాజ్ నుంచి నేరుగా త్రివేణి సంగమం వరకు ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్ సేవలు మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. ఎయిర్‌పోర్టులో దిగి 23.7 కిలో మీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమానికి హెలికాప్టర్‌లో డైరెక్టుగా వెళ్లాలంటే.. ఒక్కో ప్రయాణికుడు రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే హెలికాప్టర్ ఛార్జీ, బోట్ ట్రాన్స్‌పోర్ట్, ఇతర సేవలు కూడా ఇస్తారు. ఈ హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకోవాలంటే ముందుగానే ఫ్లై ఓలా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ సేవలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. రూ.35 వేలతో టిక్కెట్ బుక్ చేసుకుంటే.. ఎయిర్ పోర్ట్ నుంచి త్రివేణి సంగమానికి తీసుకెళ్లి.. పుణ్యస్నానాలు ఆచరించి, ఇతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి ఎయిర్ పోర్ట్‌కు తీసుకెళ్తారు.
త్రివేణి సంగమం ఎందుకంత ప్రత్యేకం..?
ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లు ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువగా త్రివేణి సంగమంలోనే పుణ్యస్నానాలు ఆచరించేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకు కారణం ఏంటంటే.. మూడు నదులు(గంగా, యమునా, సరస్వతి) కలిసే ప్రదేశాన్నే త్రివేణి సంగమం అంటారు. హిందూ ధర్మ ఆచారం ప్రకారం సాగర మథనం జరిగిన సమయంలో ఇదే ప్రదేశంలో అమృతం వచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..