న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గతేడాది సంచలనం సృష్టించిన యూజీసీ -నెట్ (2024) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మూసివేస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యంకానందున కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నివేదికను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు నివేదించడంతో పాటు కేంద్ర విద్యా శాఖకు పంపించింది. అయితే ఈ కేసు మూసివేతకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాగా UGC-NET 2024 ప్రశ్నాపత్రం జూన్ 18న డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా పరీక్ష జరిగిన మరుసటి రోజే పరీక్ష రద్దు చేశారు. దీనిపై సీబీఐ ఆ మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
జూన్ 18 పరీక్ష కోసం లీక్ అయిన ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్‌ను ఓ విద్యార్ధి డబ్బు కోసం సర్క్యులేట్ చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ అధికారులు వెల్లడించారు. రెండో షిఫ్ట్‌కి ముందు పరీక్ష రోజు మధ్యాహ్నం టెలిగ్రామ్ ఛానెల్‌లలో ఇది ప్రత్యక్షం అయింది. పేపర్ లీక్ అయిందని సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తిని విచారించగా ఈ విషయం వెల్లడైందని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి ముందు దానిని యాక్సెస్ చేసినట్లు చూపించడానికి ఓ యాప్‌ను క్రియేట్ చేసి, అందులో విద్యార్థి ఫొటో, పరీక్ష తేదీ, సమయ వంటి వివరాలు సృష్టించాడని, పరీక్ష సమయంలో ఏ అభ్యర్థికి లాభం చేకూర్చేలా ఈ లీకేజీ ఉపయోగపడలేదని, ఇందుకు ఎలాంటి ఆధారాలు మాకు లభించనందున, మేము ఈ కేసును మూసివేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీ గతంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు కేసు వివరాలను తెలియజేస్తూ ఓ వివరణాత్మక నివేదికను కూడా పంపింది.
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 ప్రాథమిక కీ విడుదల
కాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 (యూజీసీ- నెట్) సెషన్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ తాజాగా వెలువడింది. అభ్యంతరాలకు ఫిబ్రవరి 3 వరకు తెలుపవచ్చు. జనవరి 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో పరీక్షలు జరిగాయి. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.