బాధ్యతలు చేపట్టకముందు నుంచే పొరుగుదేశాలపై హెచ్చరికలతో కయ్యానికి కాలు దువ్విన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అన్నంత పనీ చేసేలాగే కన్పిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన.. ‘పనామా కాలువ ’పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న ట్రంప్.. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయన్నారు. బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలిచ్చారు. ‘‘పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది.
మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. కానీ, ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తిమంతమైన చర్య ఉండబోతోంది’’ అని ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే, దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం నాడు పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్ ములినోతో భేటీ అయ్యారు. ‘‘పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలి. లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని ములినోతో అగ్రరాజ్య విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పారు. ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు చెప్పింది ఒక్కటే.. ‘‘అమెరికా దురాక్రమణకు మేం భయపడబోం’’ అని క్లియర్ గా చెప్పారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :