గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే.. డాక్టర్లు రక్తం కారకుండా వెంటనే కుట్లు వేస్తారు. అయితే ఓ స్టాఫ్ నర్సు కుట్లకు బదులు ఫెవిక్విక్ రాసి ట్రీట్మెంట్ చేసింది. ఇదేంటి అని అడిగితే.. కుట్లు వేస్తే మచ్చలు పడతాయని.. తాను కొన్నాళ్లుగా ఇదే విధానం ఫాలో అవుతున్నట్లు చెప్పింది. ఆమె వ్యవహారం వెలుగులోకి రావడంతో వేటు పడింది.
Wound
Updated on: Feb 06, 2025 | 8:03 AM
ఎంత దారుణం.. ఎంత నిర్లక్ష్యం.. కర్నాటకలో ఓ స్టాఫ్ నర్సు పేషెంట్‌కు కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్ రాసి చికిత్స చేసింది. హవేరీ జిల్లాలో ఏడేళ్ల బాలుడి చెంపకు గాయం కావడంతో తల్లిదండ్రులు స్థానిక అడూర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం స్టాఫ్ నర్సు జ్యోతి గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసింది. తల్లిదండ్రులు అలా వద్దని చెప్పినా తాను అందరికి ఇలానే చేస్తున్నట్లు చెప్పింది. కుట్లు వేస్తే మచ్చలు ఎప్పటికీ అలానే ఉండపోతాయని వారితో వారించింది. ఈ ఘటనను వీడియో తీసిన పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ చేపట్టిన అధికారులు నర్సును సస్పెండ్ చేశారు. తొలుత నర్సును వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. స్థానికంగా నర్సు తీరు వివాదం రాజుకోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమావేశం నిర్వహించి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. అనంతరం నర్సును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫెవిక్విక్ వంటి వాటిని మెడికల్ ట్రీట్మెంట్‌లో వాడకూడదని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. తాజా ఘటనలో స్టాఫ్ నర్సు తప్పుడు విధానాన్ని అనుసరించారని, ప్రైమరీ ఎంక్వైరీ ఆధారంగా తనని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు, పూర్తి విచారణ చేపట్టినట్లు వెల్లడించింది. ఈ చికిత్స పొందిన బాలుడు ఆరోగ్య పరిస్థితిని మోనిటర్ చేస్తున్నామని.. ఏవైనా ప్రతికూల ప్రభావాలు రాకుండా నిరంతర పర్యవేక్షించాలని సంబంధిత ఆరోగ్య అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ సంఘటన జనవరి 14న హవేరి జిల్లాలోని హనగల్ తాలూకాలోని అడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..