పసుపు వేళ్ల నుంచి తీసిన ఈ ఎసెన్షియల్ ఆయిల్ చర్మాన్ని మెరుగుపరచి, మచ్చలు, మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు ఉండటం వల్ల చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఈ సమయంలో ఒకటిన్నర చెంచా ఆలివ్ నూనెలో ఒక చుక్క పసుపు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. ఇలా రాత్రిపూట చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు సమస్యగా మారితే ఈ నూనె ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటంతో చర్మం స్వచ్ఛంగా మారి, మొటిమల సమస్య తగ్గుతుంది. కొద్దిగా కొబ్బరి నూనె లేదా జోజోబాలో పసుపు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.
ముడతలు, వయసుతో వచ్చే మార్పులను తగ్గించడానికి కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో నాలుగు చుక్కల పసుపు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. దీని వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. రాత్రిపూట ఈ పద్ధతిని పాటించడం వల్ల మంచి ఫలితాలు కనబడతాయి.
ఈ నూనెను ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నేరుగా చర్మంపై రాసే ముందు దీన్ని ఇతర నూనెలో (కొబ్బరి, బాదం, జోజోబా, వంటి నూనె) కలిపి వాడాలి. ఎక్కువ మోతాదులో వాడటం మంచిది కాదు. ఈ నూనెను రాసుకున్న తర్వాత బయట ఎండలోకి వెళ్లేటప్పుడు ముఖాన్ని క్లాత్ తో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అత్యవసరం. కొద్దిగా నూనెను చేతిపై రాసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఉపయోగించవచ్చు. చర్మ తత్వానికి అనుగుణంగా వాడుకుంటే మాత్రమే దీని వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించడం ముఖ్యం.