వివాహ సమయంలో తన భార్యను సర్వకాల సర్వావస్థలయందు అండగా ఉండి కాపాడుకుంటానని వరుడు ప్రమాణం చేసి వధువును తన భాగస్వామిగా స్వీకరిస్తాడు. అదే సమయంలో కష్టసుఖాల్లో భర్తకు తోడుగా ఉంటానని వధువు ప్రమాణం చేస్తుంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య అతిధులే దేవతలుగా ఆశీర్వదిస్తుండగా వివాహం అనేది జరుగుతుంది. అందుకే హిందూ సంప్రదాయంలో వివాహబంధానికి అంత ప్రాధాన్యత ఇస్తూ వధూవరులిద్దరికీ వారి బాధ్యతలను, వారు మెలగాల్సిన తీరును చెప్పకనే చెబుతారు. ఇవన్నీ పక్కన పెడితే ఓ 56 ఏళ్ల భార్య ఆపదలో ఉన్న తన భర్తను కాపాడుకున్న తీరు ఈ వివాహబంధానికి ఉన్న శక్తిని చాటి చెబుతోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మహిళ తెగువకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతు బావిలో పడిపోయిన భర్తను 56 ఏళ్ల భార్య సమయస్పూర్తితో కాపాడుకుంది. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం తమ పెరట్లోని మిరియాల చెట్టుపైకి ఎక్కి 64 ఏళ్ల రమేశన్ మిరియాలు తీస్తుండగా ప్రమాదవశాత్తు కొమ్మ విరగడంతో పక్కనే ఉన్న 40 అడుగుల లోతైన బావిలో పడిపోయాడు. అది చూసిన భార్య పద్మ కన్నీళ్లు పెడుతూ కేకలు వేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఒక తాడు సాయంతో వెంటనే బావిలోకి దిగింది. అప్పటికే నీట మునిగి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న భర్తను సుమారు 20 నిమిషాల పాటు ఆమె అలాగే ఒడిసిపట్టుకుని పైకి వినిపించేలా గట్టిగా కేకలు వేసింది.
ఆమె కేకలు విని అటుగా వెళుతున్న వారు పరిగెత్తుకుంటూ వచ్చి బావిలోకి చూశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వలల సాయంతో దంపతులిద్దరినీ బయటకు తీశారు. అనంతరం రమేశన్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇలా సాహసోపేతంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి భర్తను కాపాడుకున్న 56 ఏళ్ల పద్మపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..