బడ్జెట్ అనగానే ముందుగా మధ్యతరగతి, వేతన జీవులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా..అందరి నోటా వినిపించింది ఒకటే మాట. పన్ను భారం తగ్గిస్తే బాగుండు అని. అందుకు తగ్గట్టుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. అసలు ఎవరూ ఊహించని స్టేట్‌మంట్ ఇచ్చారు. వ్యక్తిగత ఆదాయం 12 లక్షల రూపాయల వరకూ ఎలాంటి పన్ను వసూలు చేయబోమని తీపి కబురు చెప్పారు.
అలా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో..వెంటనే సభ అంతా దద్దరిల్లిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్రమంత్రులంతా బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిర్మలమ్మ ఆ ప్రకటన చేసినప్పుడు మధ్య తరగతి వాళ్లంతా ఇలాగే సంబర పడిపోయారు. నిజానికి 10 లక్షల రూపాయల వరకూ పన్ను మినహాయింపు ఉండొచ్చని బడ్జెట్‌కి వారం రోజుల ముందు నుంచే ప్రచారం జరిగింది. ఇది నిజమవ్వాలని మధ్యతరగతి వాళ్లు ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే నిర్మలమ్మ గుడ్‌న్యూస్ చెప్పారు. 12 లక్షల వరకూ ఆదాయం ఉన్న వాళ్లను పన్ను భారం నుంచి తప్పించారు. ఇదే సమయంలో నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం…ఏ శ్రేణివారికైనా సరే..4 లక్షల రూపాయల వరకూ ఆదాయం ఉన్న వాళ్లకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల ఆదాయముంటే 5%, 8-12 లక్షల వరకూ ఇన్‌కమ్ ఉంటే 10%, 12-16 లక్షల ఆదాయముంటే 15% పన్ను విధించనుంది కేంద్రం.